వరద సాయం ఎవరికిస్తారు? ఎలా ఇస్తారు? ఎప్పుడిస్తారు?

వరద సాయం ఎవరికిస్తారు? ఎలా ఇస్తారు? ఎప్పుడిస్తారు?
  • స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్..  రూ.10 వేల పంపిణీపై నో గైడ్​లైన్స్
  • భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనే పంపిణీకి ఏర్పాట్లు!
  • పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే ఇచ్చేలా ప్రతిపాదనలు
  • ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోనూ 
  • తీవ్ర నష్టం..  862 గ్రామాల్లో వరదల ఎఫెక్ట్

హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వరద బాధిత కుటుంబాలకు సాయంపై రాష్ట్ర సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనే దానిపై గైడ్​లైన్స్ లేకపోవడంతో గందరగోళంగా మారింది. అందరికీ ఇస్తారా లేక కొందరికే ఇచ్చి వదిలేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌‌‌‌ భద్రాద్రి, ములుగు జిల్లాలలో ముంపు ప్రాంతాలను పరిశీలించి పదివేల సాయంపై ప్రకటన చేశారు. ఇది జరిగి 4 రోజులు కావస్తున్నా సర్కార్​ నుంచి క్లారిటీ రాలేదు. వరదకు వందల గ్రామాలు నీట మునిగాయి. ప్రభుత్వం మాత్రం 3 జిల్లాల్లోనే సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మిగతా జిల్లాల్లోని బాధితులు తమ పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిగతా జిల్లాల్లో వారి పరిస్థితి ఏంటి

రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి అయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని వారికే రూ.10 వేలు అందించనున్నట్లు సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. మిగతా జిల్లాల్లో సాయంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. అదే టైంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే సాయం అందించనున్నట్లు చెప్తున్నారు. అయితే గ్రామాలు నీట మునగడంతో చాలా కుటుంబాలు ఇతర గ్రామాల్లో ఉన్న వారి బంధువుల ఇండ్లళ్ల తలదాచుకున్నారు. వారికి సాయం చేస్తారా? లేదా? వారి వివరాలు ఎలా తీసుకుంటారనే దానిపై కూడా స్పష్టత లేదు. వర్షాలు, వరదలకు 14 జిల్లాల్లో ఇప్పటి వరకు 32 మంది మృతిచెందారు. ఈ మేరకు కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు, కామారెడ్డిలో ఐదుగురు చనిపోయారు. రంగారెడ్డి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, మేడ్చల్, నల్లగొండ, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, జగిత్యాల్, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, వరంగల్, మహబూబాబాద్​లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. ఇండ్లలోకి నీరు చేరడంతో ఉండేందుకు గూడు లేక, తినడానికి తిండి లేక జనం నానా అవస్థలు పడ్డారు. ఇండ్లు కూలి, పంటలు నీట మునిగి తీవ్ర ఆస్తి నష్టం వాట్లిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గోదావరి నదీ పరీవాహాక ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 862 గ్రామాలు ఎఫెక్ట్ అయినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు.

పంపిణీపై గైడ్ లైన్స్ లేవు

వరద సాయం పంపిణీపై ఇప్పటికీ గైడ్​లైన్స్ లేవు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తమని సీఎం ప్రకటన చేయడమే కానీ ఎలా ఇస్తారు? అనేదానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆ 3 జిల్లాల వాళ్లకే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే వారికి నగదు చేతికిస్తారా? లేక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకుపైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. వారంతా వివిధ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో ములుగు, జయశంకర్ భూపాపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వాళ్లే 14 వేల మంది ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. మిగతా ఇతర జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు.

జీహెచ్​ఎంసీ వరద సాయం లాగే ఉంటదా?

2020 నవంబర్​లో వర్షాలకు హైదరాబాద్​లో చాలా కాలనీలు నీట మునిగాయి. అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలుండటంతో  ప్రభుత్వం వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం ఇస్తామని.. రూ.10 వేల చొప్పున కొందరి ఖాతాల్లో జమ చేసింది. ఆపై అధికారులను పక్కనపెట్టి అధికార పార్టీ నాయకులే నగదు సాయం అందజేశారు. ఇందులో కొంత మొత్తాన్ని వారే తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అసలైన బాధితులకు సాయం దక్కలేదు.

సాయం అందిస్తే తిండిగింజలు కొనుక్కుంటం

గోదారి వరదలకు మా ఇల్లు కూలిపోయింది. బియ్యం, ఉప్పు, కారం, ఇతర సామాన్లు అన్నీ తడిసి పనికిరాకుండా పోయినయ్. బట్టలు కూడా ఖరాబైనయ్. తినడానికి ఇంట్ల ఏమీ లేవు. సర్కారోళ్లు రూ.10 వేలు ఇస్తే బియ్యం, ఉప్పులు, పప్పులు సామాన్లు, బట్టలు కొనుక్కుంటం.

‒ దేపాక నర్సమ్మ, రామన్నగూడెం, ఏటూరు నాగారం, ములుగు

కూలిన ఇంటి గోడలు కట్టుకుంటం

వానలు, గోదావరి వరదలకు ఇంటి గోడలు కూలిపోయాయి. కుటుంబమంతా వానలో దిక్కుతోచని స్థితిలో గడిపినం. కూలిన ఇంట్లో ఉండలేని పరిస్థితి. మొన్న సీఎం సారు వచ్చినప్పుడు నా బాధ చెప్పుకుంట అంటే పోలీసులు పోనియ్యలే. నా భర్త కిడ్ని వ్యాధితో చనిపోయిండు. సాయం కోసం చూస్తున్నం. సర్కార్ పెద్ద మనస్సుతో సాయం అందించాలి.

‒ గద్దల సావిత్రి, రామన్నగూడెం, ఏటూరు నాగారం, ములుగు