ఆసిఫాబాద్​లో పొంగుతున్న వాగులు, వంకలు

ఆసిఫాబాద్​లో పొంగుతున్న వాగులు, వంకలు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్​జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు కుమ్రంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన పెద్ద వాగులోకి వదిలారు. కాగజ్ నగర్ లో వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. దహెగాం మండలంలో గవర్నమెంట్ స్కూల్ గోడ కూలింది. వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. పెద్దవాగుతో పాటు పెన్ గంగా, ప్రాణహితలో నీటి ప్రవాహం పెరిగింది. గుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహానికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావడానికి వాంకిడి మీదుగా 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కెరమెరి మండలంలోని ఉమ్రి, అనార్ పల్లి, లక్మాపూర్ వాగులు ఉప్పొంగడంతో ఆ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత

కుమ్రంభీం, వట్టివాగు ప్రాజెక్టులకు ఇన్​ఫ్లో పెరగడంతో ఇరిగేషన్ అధికారులు దిగువకు నీళ్లు వదులుతున్నారు. కుమ్రంభీం ప్రాజెక్ట్ కెపాసిటీ 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం  8.705 టీఎంసీలు ఉన్నాయి.  మొత్తం 243 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 241.3 మీటర్లకు చేరుకుంది.  ఇన్ ఫ్లో 8,800 క్యూసెక్కులు ఉండగా ముందు జాగ్రత్తగా అధికారులు 5, 6  గేట్లు ఎత్తి  దిగువకు5,512 క్యూసెక్కుల నీటిని వదిలారు. వట్టివాగు ప్రాజెక్ట్ కెపాసిటీ 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.291 టీఎంసీ లకు చేరుకుంది. ప్రాజెక్ట్ వాటర్ లెవల్ 239.500 మీటర్లు కాగా ప్రస్తుతం 238 మీటర్లుగా ఉంది. 2, 3 గేట్లు ఎత్తి 1,083 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 

కూలిన ఇంటి గోడ

మల్హర్,కామారెడ్డి: జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం నాచారం గ్రామానికి చెందిన మేకల రాజు ఇంటి గోడ శనివారం రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది. దీంతో ఇంటిలోని వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని రాజు వాపోయారు. కామారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జోరు వాన కురిసింది.  జిల్లావ్యాప్తంగా 24 గంటల్లో  3.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పలు చోట్ల కరెంట్ వైర్లు తెగి, ప్రజలు అంధకారంలో గడిపారు.