నీట మునిగిన ఊళ్లకు వెళ్లి పరిస్థితి చూడని ఆఫీసర్లు

నీట మునిగిన ఊళ్లకు వెళ్లి పరిస్థితి చూడని ఆఫీసర్లు
  • నీట మునిగిన ఊళ్లకు వెళ్లి పరిస్థితి చూడని ఆఫీసర్లు
  • సెంటర్లలో కూర్చొని బాధితుల జాబితా
  • డోర్ టు డోర్ సర్వే చేయాలంటున్న బాధితులు

భద్రాచలం,వెలుగు : వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల పరిహారం ఇచ్చేందుకు అధికారులు చేపట్టిన సర్వేపై బాధితులు మండిపడుతున్నారు. ఆఫీసర్లు ముంపు ప్రాంతాల్లో తిరగకుండానే.. లిస్టులు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సర్వే టీమ్​లు వరద ముంపు గ్రామాల్లో డోర్​టు డోర్​ వెళ్లి.. ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు,రీహాబిలిటేషన్​సెంటర్​కు వచ్చారా?, ఏ సెంటర్​లో ఉన్నారు? తదితర వివరాలు తీసుకోవాలి. కానీ సర్వే సిబ్బంది ఎక్కడికీ వెళ్లకుండానే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి పేర్లనే రాసుకుంటున్నారు. దీంతో పాటు కొందరు లీడర్లు జోక్యం చేసుకుని తమ అనుచరుల పేర్లను రాయించుకుంటున్నారని బాధితులు అంటున్నారు. భద్రాచలం పట్టణానికి చెందిన చాలామంది బాధితులు పునరావాస కేంద్రాలకు రాలేదు. సామాన్లు సర్దుకుని కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. సెంటర్లలోనే కూర్చుని లిస్టులు తయారు చేయడం వల్ల వారి పేర్లు లిస్టులో నమోదు కావడం లేదు. శాంతినగర్​కాలనీలో 200 ఇండ్లు మునిగాయి. వీరి పేర్లు లిస్టులో నమోదు కాలేదు. రామాలయం పరిసరాల్లో ఉన్న దుకాణాలు మొత్తం మునిగిపోయి, సామన్లు, బొమ్మలు పాడైపోయాయి. ఇక్కడున్న దాదాపు 200 కుటుంబాలను సీతానిలయంలోకి మార్చారు. వీరి పేర్లను కూడా సర్వే సిబ్బంది నమోదు చేయలేదు.అశోక్​నగర్ కొత్తకాలనీలో 3 కుటుంబాలు, ఏఎంసీ కాలనీ, సుభాష్​నగర్​కాలనీల్లో మరో 2 ఇండ్లు, అశోక్​నగర్ శ్రీలంక కాలనీలో 5 ఇండ్లు మునిగిపోయాయి. వీరెవరి పేర్లనే సర్వే టీమ్​లు లిస్ట్​లో రాయలేదు. ముంపునకు గురికాపోయినా అశోక్​నగర్​ కాలనీలో ఓ మహిళా ఆర్ఎంపీ, చర్ల రోడ్డు ఏరియాలో ఐదు కుటుంబాల పేర్లను లోకల్​రూలింగ్​పార్టీ లీడర్ల ఒత్తిడితో బాధితుల లిస్టులో చేర్చారు.
 
రేషన్​ పంపిణీపైనా ఆందోళనలు
పునరావాస కేంద్రాల్లో రేషన్​ పంపిణీ కూడా గందరగోళంగా మారింది. కొన్ని సెంటర్లలో సన్నబియ్యం ఇస్తున్నారని, మరికొందరికి దొడ్డు బియ్యం ఇస్తున్నారని బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఐటీడీఏ గిరిజన అభ్యుదయ భవనంలో ఉన్న బాధితులకు దొడ్డు బియ్యం ఇవ్వడంతో రాస్తారోకో చేశారు. మార్కెట్ యార్డు దగ్గరున్న పునరావాస కేంద్రంలోనూ బుధవారం దొడ్డబియ్యం సప్లై చేశారు. అశ్వాపురం మండలం నెల్లిపాక కేవీఆర్ ఫంక్షన్​హాలులోని సెంటర్​లో కొందరికే రేషన్​ ఇచ్చారు. మిగిలిన వారికి సరుకులు ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. సరుకులు తీసుకున్నవారు కూడా అందరికీ ఇచ్చేంతవరకు తమకు కూడా రేషన్​వద్దని వాపసు ఇచ్చారు.