
- నీట మునిగిన వెయ్యికి పైగా ఇండ్లు
- 1,200 మంది షెల్టర్లకు తరలింపు
- చాదర్‌ఘాట్, మూసారంబాగ్ బ్రిడ్జీలు, జియాగూడ రోడ్డు క్లోజ్
- జలదిగ్బంధంలో ఎంజీబీఎస్.. కూలిన రిటైనింగ్ వాల్
- బస్టాండ్ బంద్.. జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి బస్సుల రాకపోకలు
- వరద కాస్త తగ్గినా బురదతో జనం ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ను మూసీ ముంచెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయగా భారీగా వరద రావడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. వెయ్యికి పైగా ఇండ్లలోకి వరద చేరింది. అధికారులు ఆ ఇండ్లకు కరెంట్ నిలిపివేశారు. 8 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 మందిని తరలించారు. ఇంకొందరు బంధువులు, తెలిసిన వారి ఇండ్లకు వెళ్లి తలదాచుకున్నారు. మూసీకి వరద పోటెత్తతడంతో చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, కమలానగర్, జియాగూడ, అంబర్‌పేట్ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద కారణంగా మూసారంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జీలను క్లోజ్ చేశారు. జియాగూడ–పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డుపైనా రాకపోకలు నిలిపివేశారు. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు, హిమాయాత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే రూట్‌లోనూ రాకపోకలు బంజేశారు. నార్సింగి వద్ద శంకర్‌పల్లి వెళ్లే ఓఆర్ఆర్ ఎగ్జిట్ క్లోజ్ చేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా కోఠి నుంచి దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్ నుంచి మలక్‌పేట్ వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు జామ్ అయ్యాయి. సిటీ నుంచి ఎల్బీనగర్ వైపు వచ్చే వాహనాలను తార్నాక, ఉప్పల్ మీదుగా మళ్లించారు. కాగా, మూసారంబాగ్ వద్ద వరదలో ఓ డీసీఎం కొట్టుకొచ్చింది.
తడిసిన వస్తువులు..
నదీ పరీవాహక ప్రాంతాల్లో దాదాపు వెయ్యికి పైగా ఇండ్లలోకి వరద చేరి, ఇండ్లలోని నిత్యావసరాలన్నీ తడిసిపోయాయి. టీవీలు, ఫ్రిడ్జ్‌లు, బైక్‌లు, కార్లు, ఆటోలు నీట మునిగాయి. శనివారం సాయంత్రానికి వరద తీవ్రత కాస్త తగ్గినా.. ఎక్కడికక్కడ బురద పేరుకుపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్, శంకర్ నగర్ ప్రజలు మురుగుమయంగా మారిన తమ ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు. బురద చేరి వస్తువులు, వాహనాలన్నీ పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ప్రభుత్వం వరద సాయం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
హెల్త్ క్యాంపులు ఏర్పాటు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 7 ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి అందరికీ మందులు అందించారు. ఎక్కువగా చర్మ సమస్యలకి సంబంధించిన మందులను పంపిణీ చేశారు. వరద ప్రభావంతో హెల్త్ ప్రాబ్లమ్స్వచ్చే అవకాశం ఉండటంతో క్యాంపులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు హెల్త్ క్యాంపులు కొనసాగనున్నాయి.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నం: పొన్నం
వరద వచ్చినప్పుడు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి చాదర్‌ఘాట్ బ్రిడ్జి, ఎంజీబీఎస్, మలక్‌పేటలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. వరద ధాటికి ఎంజీబీఎస్ మునిగిపోవడంతో బస్టాండ్‌ను క్లోజ్ చేశామని చెప్పారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి సైడ్ వాల్స్ కొట్టుకుపోయాయని తెలిపారు. పండగ పూట ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఏయే జిల్లాల బస్సులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయో ప్రజలకు తెలియజేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. కాగా, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, దుర్గానగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పర్యటించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆర్వీ కర్ణన్
మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ముసారంబాగ్ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని కర్ణన్ శనివారం పరిశీలించారు. వరద ఉధృతికి సెంట్రింగ్ మాత్రమే కొట్టుకుపోయిందని, పెద్ద నష్టమేమీ లేదని అధికారులు ఆయనకు తెలిపారు. తర్వాత గోల్నాకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కమిషన్ వెళ్లి, వరద బాధితులతో మాట్లాడారు. అందరికీ భోజనం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎంజీబీఎస్‌లోకి భారీ వరద..
ఎంజీబీఎస్‌ను మూసీ వరద ముంచెత్తింది. మూసీ నీళ్లు బస్టాండ్‌లోకి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించగా, శుక్రవారం వరద ఉధృతికి అది కూలిపోయింది. దీంతో బస్టాండ్‌లోకి భారీగా వరద చేరింది. ప్లాట్‌ఫామ్స్ అన్నీ నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వరదలో చిక్కుకున్న ప్రయాణికులను అధికారులకు తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. బస్టాండ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులను జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్టు తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్ బస్స్టేషన్ల నుంచి.. వరంగల్, హనుమకొండవైపు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్‌రోడ్స్ నుంచి.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి.. మహబూబ్‌నగర్, కర్నూల్‌వైపు వెళ్లే బస్సులను ఆరాంఘర్ నుంచి నడుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఎంజీబీఎస్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో వరదలు రాలేదని అధికారులు అంటున్నారు. శనివారం సాయంత్రానికి వరద తగ్గడంతో బస్టాండ్ పూర్వ స్థితికి చేరింది.
హైడ్రా కమిషనర్ పర్యటన..
వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్, నార్సింగి ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించారు. చాదర్‌ఘాట్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీంచారు. నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
సిబ్బంది సహాయక చర్యలు..
వరదలో చిక్కుకున్నోళ్లను హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. అంబేద్కర్ నగర్‌లో ఇండ్లలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే ప్రాంతంలో ఇండ్ల పైఅంతస్తుల్లో తలదాచుకున్నోళ్లకు డ్రోన్ల ద్వారా ఫుడ్, వాటర్ బాటిల్స్ అందించారు. పురానాపూల్దగ్గర ఉన్న శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుపోగా, క్రేన్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు. అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్‌లోకి వరద పోటెత్తగా, అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు.