నిజామాబాద్ జిల్లాలో రెండో రోజూ దంచికొట్టిన వాన

నిజామాబాద్ జిల్లాలో రెండో రోజూ దంచికొట్టిన వాన
  • రోడ్లన్నీ జలమయం
  • తడిసిన వడ్లు, పొగాకు 
  • రోడ్లపై విరిగిపడ్డ చెట్లు  

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం కూడా వర్షం దంచికొట్టింది. ఆర్మూర్, బాల్కొండ  మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి.  త్వరగా కాంటాలు వేయడం లేదని  ఆర్మూర్​లో రైతులు రాస్తారోకో చేశారు. ఆర్డీవో రాజాగౌడ్ వచ్చి తడిసిన వడ్లను కొనేలా మిల్లర్లను ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. బోధన్ డివిజన్​లో వర్షం పొగాకు రైతులను ఆగం చేసింది. అమ్మకాలకు సిద్ధం చేసిన పొగాకు తడిసిపోయింది.   

కామారెడ్డి జిల్లాలో..  

 కామారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన వర్షానికి  రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. అశోక్​నగర్ కాలనీ రోడ్డు, స్టేషన్​ రోడ్డు, విద్యానగర్ కాలనీ, నిజాంసాగర్​ రోడ్డు, పాత బస్టాండు, జేపీఎన్​  రోడ్డులో వదర నీరు రోడ్డుపై ప్రవహించింది.  బుధవారం రాత్రి, గురువారం కామారెడ్డి, బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్​,  పిట్లం, భిక్కనూరు, పాల్వంచ, గాంధారి, సదాశివనగర్​, రామారెడ్డి, డొంగ్లి, తాడ్వాయి,  ఎల్లారెడ్డి, పెద్దకొడప్​గల్​, లింగంపేట, రాజంపేట మండలాల్లో వర్షం పడింది.  బీర్కుర్​ మండలం నుంచి వెంకటప్పయ్య క్యాంపునకు వెళ్లే  రోడ్డుపై చెట్లు విరిగి పడి  కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.