
- జీఆర్, హౌసింగ్ కాలనీ పరిస్థితి మరింత అధ్వానం
- ఇండ్లన్నీ బురద, చెత్తమయం.. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
- పాడైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు
- తడిచిపోయిన పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు
- పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లకు చేరుకుంటున్న బాధితులు
- పాడైన వస్తువులను చూసి కన్నీటి పర్యంతం
కామారెడ్డి, వెలుగు: భారీ వరద తీవ్రత నుంచి కామారెడ్డి జిల్లా ఇంకా కోలుకోవట్లేదు. టౌన్‌లోని జీఆర్, హౌసింగ్ కాలనీలతోపాటు ఎటు చూసినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇండ్లల్లోకి వరద చేరి పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు తడిచిపోయాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లోకి బురద చేరి పని చేయడం లేదు. ఫర్నిచర్, ఫుడ్ఐటమ్స్బురదమయమయ్యాయి. వినాయకుడి ప్రతిష్ఠాపన కోసం వేసిన మండపాలు, పూజా సామగ్రి వరదలో కొట్టుకుపోయాయి. వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించకుండా అలాగే ఓమూలన ఉండిపోయాయి.
ఇండ్లలో నుంచి నీళ్లు బయటకు పోగా బురద, చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నది. రెండు రోజుల పాటు బంధువుల ఇండ్లు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు.. ఇప్పుడిప్పుడే ఇండ్ల వద్దకు చేరుకుంటున్నారు. వరదల్లో పాడైపోయిన వస్తువులను చూసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు అన్ని వస్తువులపై బురద పేరుకుపోవడంతో బయట వేసి శుభ్రం చేసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీతో పాటు మున్సిపల్ సిబ్బంది ఇండ్లలో బురదను బయటకు పంపించేందుకు సాయం చేస్తున్నారు.
ఫైర్ఇంజిన్, ట్యాంకర్ల ద్వారా వాగులో నుంచి పైపులు ఏర్పాటు చేసి నీళ్లు కొడుతున్నారు. హౌసింగ్‌కాలనీ నుంచి సారంపల్లి చౌరస్తా వరకు పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. బ్రిడ్జి కూడా సగం తెగిపోయింది. డివైడర్ కంప్లీట్‌గా కొట్టుకుపోయింది. దేవునిపల్లి శివారులోని దేవి విహార్ వద్ద రోడ్డు, డివైడర్లు దెబ్బతిన్నాయి. కలెక్టర్ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్చందర్, అధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.
కొనసాగుతున్న రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు
భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి సమీపంలో వరద ప్రవాహంతో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో మూడు రోజులుగా సికింద్రాబాద్‌నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్‌వైపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ట్రాక్‌ను తిరిగి పునరుద్ధరించే పనులు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం వరకు పనులు చివరి దశకు చేరాయి. శనివారం రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన
జిల్లా కేంద్రానికి సమీపంలోని సారంపల్లి, చిన్నమల్లారెడ్డి వాసులు కొన్ని వినాయక విగ్రహాలను పండుగ రోజు తీసుకువెళ్దామని ఆర్డర్ ఇచ్చారు. వరద వచ్చి రోడ్లు దెబ్బతినడంతో పండుగ రోజు చిన్న విగ్రహాలను పెట్టి పూజలు చేసి.. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చి అర్డర్ ఇచ్చిన పెద్ద విగ్రహాలను తీసుకెళ్లి ప్రతిష్ఠించారు.
ఎన్‌హెచ్– 44పై ట్రాఫిక్ జామ్
నేషనల్ హైవే–44పై శుక్రవారం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్చౌరస్తా వద్ద హైవేకు ఓ వైపు రోడ్డు దెబ్బతిన్నది. పోలీసులు వాహనాలను ఒక వైపు నుంచి మాత్రమే పంపారు. దీంతో హైదరాబాద్ నుంచి నిజా మాబాద్, కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. టేక్రియాల్చౌరస్తా వద్ద రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది. సింగిల్ వే కావడంతో వాహనాలు మెల్లిమెల్లిగా గంటలపాటు కదిలాయి. ఇదే టైంలో అంబులెన్స్‌లకు కష్టాలు తప్పలేదు.
కామారెడ్డి నుంచి హైదరాబాద్, నిజామాబాద్ వైపు బస్సు సర్వీసులను శుక్రవారం నుంచి పునరుద్ధరించారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మార్గంలో రాకపోకలు కంప్లీట్‌గా నిలిచిపోయాయి. ఈ రూట్లో బస్సులు నడవట్లేదు. బ్రిడ్జి తెగిపోయి బీబీపేటకు కూడా రవాణా వ్యవస్థ స్తంభించింది. పాల్వంచ వాగు ఉధృతితో కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు కూడా బస్సులు నడవలేదు. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిని నిలిచిపోయిన వాహనాల రాకపోక ల్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.