హిమాచల్‎లో వరద బీభత్సం.. 69 మంది మృతి.. రూ.700 కోట్ల ఆస్తి నష్టం

హిమాచల్‎లో వరద బీభత్సం.. 69 మంది మృతి.. రూ.700 కోట్ల ఆస్తి నష్టం

న్యూఢిల్లీ: కుండపోత వర్షాలు హిమాచల్​ప్రదేశ్‎ను అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటిదాకా 69 మంది చనిపోయారు. 37 మంది గల్లంతవ్వగా.. 110 మంది గాయపడ్డారు. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నేషనల్ హైవేలు కోతకు గురవ్వడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. రైల్వే ట్రాక్‎లు నీళ్లలో తేలుతున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

5న సిమ్లా, సోలన్‌‌‌‌‌‌‌‌, సిర్మౌర్‌‌‌‌‌‌‌‌, 6న ఉనా, బిలాస్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, హమీర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మాన్​సూన్‎లో ఇప్పటి దాకా సుమారు రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని హిమాచల్​ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. తాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. కరెంట్ స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాలకు పవర్ సప్లై ఆగిపోయిందని తెలిపారు. మాన్​సూన్ నష్టాలపై సీఎం సుఖ్విందర్ శుక్రవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. 

వరద బాధితులకు అండగా ఉంటాం

వరద బాధితులను ఆదుకుంటామని సీఎం సుఖ్విందర్ సింగ్ ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేలు ఇస్తామని తెలిపారు. ‘‘రిలీఫ్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మండి జిల్లా తీవ్రంగా చాలా ప్రభావితమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు’’అని సీఎం సుఖ్విందర్ తెలిపారు. మండి జిల్లాలో వర్షాలకు 13 మంది వరకు చనిపోయారు. కాంగ్రాలో 13 మంది, చంబాలో ఆరుగురు, షిమ్లాలో ఐదుగురు మృతి చెందారు. 

మండి జిల్లాలోని బాగ్​సయేద్, తునాగ్ ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ రెండు ప్రాంతాలు మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ అసెంబ్లీ సెగ్మెంట్​లో ఉన్నాయి. కర్సోగ్, ధరంపూర్​ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఒక్క మండి జిల్లా నుంచి 40 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. వందల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 14 బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 500 రోడ్లు మూసేశారు. 500కు పైగా ట్రాన్స్​ఫార్మర్లు చెడిపోయాయి. బియాస్‌‌‌‌‌‌‌‌ సహా ప్రధాన నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. 

అస్సాంలో డేంజర్ మార్క్​లో 2 నదులు: సీడబ్ల్యూసీ

అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయని, గోలాఘాట్ జిల్లాలోని ధన్సిరి (సౌత్) నది, శివసాగర్ జిల్లాలోని దిఖోవ్ నది డేంజర్ మార్క్ ను దాటి ప్రవహిస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుక్రవారం విడుదల చేసిన బులిటెన్​లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ‘‘సివియర్ ఫ్లడ్​ లెవల్’’ ​లో ఈ 2 ప్రాంతాలే ఉన్నాయని వివరించింది. నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటినప్పటికీ.. వరద తీవ్రత అంత ఎక్కువగా లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తే ప్రదేశాలు 14 ఉన్నాయని వెల్లడించింది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్​లో సాధారణం కంటే ఎక్కువ లెవల్​లో నదులు ప్రవహిస్తున్నాయని వివరించింది.