తెలంగాణ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించి ఎంతో నష్టాన్ని కలిగించాయని.. ఈక్రమంలో సహాయక చర్యలు పర్యవేక్షించాల్సింది పోయి.. ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోతే మాకెందుకు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. జనం చచ్చినా పర్వాలేదు వారికి మాత్రం రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. వర్షాలతో మూసీ ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిపోతుడడం జరుగుతోందని.. ఏటా వర్షాలకు ఇదే పరిస్థితి చూడాల్సి వస్తోందని తెలిపారు. మూసీ వరదలకు ఇళ్ళు మునిగి పోతున్నా ముందస్తు చర్యలు ఉండవని విమర్శించారు
అక్రమ కట్టడాలు తొలగిస్తామంటూ హడావిడి చేస్తాడని.. తీరా మాటలు చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవని ఎద్దేవా చేశారు. దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు... చేతులు కాలాక ఆకులు పట్టుకొనుడు ఇలా సీఎం కేసీఆర్ పాలన ఉందని సెటైర్స్ వేశారు. మూసీ నదికి ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గింది. దీంతో బ్రిడ్జి కింద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద కారణంగా బ్రిడ్జి చాలా వరకు పాడైందని అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున చెత్తా చెదారం నిండి ఉండడంతో వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. క్లీనింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. బ్రిడ్జిని క్లీన్ చేసేందుకు వంద మంది జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని నిన్న స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. మరోవైపు.. బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
