పెట్రో రేట్ల గురించి కేంద్ర, రాష్ట్రాలు మాట్లాడుకోవాలి

పెట్రో రేట్ల గురించి కేంద్ర, రాష్ట్రాలు మాట్లాడుకోవాలి
  • పెట్రో ప్రొడక్ట్స్​ రేట్లు తగ్గాలి
  • దీనిపై కేంద్రం, రాష్ట్రాలు మాట్లాడుకోవాలి: ఆర్థిక మంత్రి
  • మరికొన్నేళ్లు స్టిమ్యులస్ ఇస్తాం
  • ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి
  • ఇన్వెస్టర్లు ముందుకు రావాలి

న్యూఢిల్లీ: మనదేశంలో వరుసగా 12వ రోజు కూడా పెట్రో ప్రొడక్టుల రేట్లు పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్​ మాట్లాడారు. ఇది కచ్చితంగా ఇబ్బందికరమైన సమస్యే అని, ధరలు తగ్గితేనే ఉపశమనం దొరుకుతుందని అన్నారు. ధరలు న్యాయంగా ఉండేలా చూడటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని కామెంట్​ చేశారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఆలిండియా మేనేజ్​మెంట్​ అసోసియేషన్​ (ఏఐఎంఏ) సమావేశంలో మాట్లాడుతూ ఆమె పైవిధంగా అన్నారు.  పెట్రోల్​పై 60 శాతం, డీజిల్​పై 54 శాతం కేంద్రం, రాష్ట్రాల పన్నులు ఉండటంతో రేట్లు చుక్కలనంటుతున్నాయి. అయినప్పటికీ  శనివారం కూడా లీటరు పెట్రోల్​పై 39 పైసల చొప్పున, డీజిల్​పై 37 పైసల చొప్పున పెంచాయి. 2017 నుంచి పెట్రో రేట్లను రోజువారీగా మార్చుతున్నారు. అయితే ఇంత భారీగా పెంచడం మాత్రం ఇదే తొలిసారి. ఫలితంగా ముంబైలో లీటరు పెట్రోల్​ ధర శనివారం రూ.97కు చేరింది. డీజిల్​లీటరు ధర రూ.88 అయింది. ఢిల్లీలో వీటి ధరలు వరుసగా రూ.90.58, రూ.80.97లకు చేరాయి.కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్​ ధర ఇది వరకే రూ.100 దాటింది.

మీ దమ్మేంటో చూపండి!

ఇండియాను ‘అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ’గా మార్చడానికి శాయశక్తులా కృషి చేయాలని ఇండస్ట్రియల్​ సెక్టార్​ను ఈ సందర్భంగా ఆమె కోరారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.    ఇందుకోసం తమ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని, కార్పొరేట్​ ట్యాక్స్​తగ్గించడం ఇందులో ఒకటని ఆమె వివరించారు. ‘‘ఇండియాలో ప్రైవేటు కంపెనీలు భారీ ఎత్తున ఇన్వెస్ట్​ చేస్తున్నాయి. మనదేశం ఫాస్టెస్ట్​ గ్రోయింగ్​ ఎకానమీగా ఎదుగుతుందన్న నమ్మకం ప్రైవేటు వాళ్లకు ఉంది. మనం మన సత్తాను మరింత పెంచుకోవాలి. విస్తరణ తప్పనిసరి. ప్రొడక్షన్​ను బాగా పెంచాలి. ఫలితంగా ఎకానమీ మరింత చురుగ్గా కదులుతుంది. కార్పొరేట్​ ట్యాక్స్​ తగ్గింపు వల్ల మరిన్ని ప్రైవేటు ఇన్వెస్ట్​మెంట్లు కచ్చితంగా వస్తాయి. ప్రభుత్వ పాలసీలు, ట్యాక్సేషన్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​, ప్రైవేటైజేషన్​ గురించి బడ్జెట్​లో పూర్తి వివరాలు ఇచ్చాం. ఇన్వెస్ట్​మెంట్​ చేయడానికి ప్రైవేటుసెక్టారుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఎకానమీ రికవరీ కోసం ఇక నుంచి కూడా స్టిమ్యులస్​ ప్యాకేజీ ఇస్తాం. ఇది కొన్నేళ్లపాటు ఉంటుంది”అని ఆమె వివరించారు.

పీఎస్​యూలను మరింత బాగా నడుపుతాం…

డిజిన్వెస్ట్​మెంట్​ గురించి మాట్లాడుతూ ఎకానమీని మరింత డెవలప్​ చేయడానికి ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మాలని నిర్ణయించుకున్నామని మంత్రి నిర్మల చెప్పారు. ట్యాక్స్​పేయర్ల డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తామని చెప్పారు. ‘‘పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం అంటే పబ్లిక్​ సెక్టార్​ యూనిట్లను (పీఎస్​యూలను) మూసేయడం కాదు. వాటిని మరింత బాగా నడిపించాలన్నదే మా ప్రయత్నం. స్టీల్​, రాగి, బొగ్గు వంటి వాటికి చాలా డిమాండ్ ఉంది. పీఎస్​యూలు మరింత సమర్థంగా పనిచేయాలి. డిమాండ్​ను అందుకోవాలి. ఇన్​ఫ్రాకు ఫండ్స్​ పెంచడం వల్ల అన్ని ఇండస్ట్రీలూ బాగుపడతాయి. రాబోయే పదేళ్లలో మరింత గ్రోత్​ సాధ్యమవుతుంది” అని నిర్మలా సీతారామన్​ వివరించారు.

For More News..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన నవోమి ఒసాకా

త్వరలో యోనో మర్చంట్‌ యాప్‌

చికెన్ వేస్టేజ్‌తో చేపల పెంపకం.. తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు