రేపే (జూన్ 28) ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

రేపే (జూన్ 28) ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌‌‌‌ఎంజీఈ) ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌‌‌‌బీఈఎంఎస్) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకు, మధ్యాహ్నం 1:30 గంటలకు ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌‌‌‌లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. మెడికల్​కారణాలు ఉంటే తప్ప మాస్క్ ధరించొద్దని తెలిపారు. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు బోర్డు అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను చెక్ చేస్తూ ఉండాలని అధికారులు సూచించారు.