- బరిలో నిలిచేందుకు వనరులు సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు
- పంచాయతీ ఎన్నికల విజయోత్సహాంలో కాంగ్రెస్ శ్రేణులు
- బల్దియాల్లోనూ పై చేయి సాధించేందుకు ప్రణాళిక
- కీలక లీడర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఆశావహులు
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, ప్రధాన పార్టీల నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇవ్వడంతో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లతోపాటు పోటీ చేయాలనుకుంటున్న ద్వితీయ శ్రేణి లీడర్లు తాము బరిలో దిగాలనుకునే డివిజన్లపై దృష్టిసారించారు.
పార్టీ గుర్తుపై జరిగే ఎన్నిక కావడంతో పార్టీ బీఫామ్ కోసం లీడర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఎన్నికలు ఉంటాయనే ఆలోచనతో కొన్నాళ్లుగా జనంలో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీల్లో సొంత ఖర్చులతో చిన్నచిన్న పనులు చేయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు.. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీలు, పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ తోపాటు మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26తో ముగిసింది. అప్పటి నుంచి స్పెషలాఫీసర్ల పాలన నడుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ నిలిచిపోయాయి. దీంతో మున్సిపాలిటీల నిర్వహణ కోసం సొంత వనరుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. అభివృద్ధి పనులతోపాటు రెగ్యులర్ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైంది.
పంచాయతీ ఎన్నికల విజయోత్సహాంలో కాంగ్రెస్ శ్రేణులు
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచిన విషయం తెలిసిందే. ఇండిపెండెంట్లుగా గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈక్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు.
11 నెలల కింద ముగిసిన పాలకవర్గాలన్నీ దాదాపు బీఆర్ఎస్ పార్టీకే చెందినవే ఉన్నాయి. ఈ సారి ఆయా స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు పావులు కదుపుతున్నారు.
కరీంనగర్ పై స్పెషల్ ఫోకస్..
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల చర్చించారు. ఇందులో భాగంగా సమన్వయం కోసం కరీంనగర్ నగరవ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లను 6 జోన్లుగా విభజించారు.
ఒక్కో జోన్ పరిధిలోకి 11 డివిజన్లను చేర్చారు. ప్రతి జోన్‌కు బాధ్యులుగా ముగ్గురు సభ్యులను నియమించాలని, ఇందులో ఒకరు జనరల్ సెక్రటరీగా, ఇద్దరు సెక్రటరీలుగా బాధ్యతలు నిర్వహిస్తారని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
