ఇష్టమైన పాట వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. కాకపోతే పాటలు వినేవాళ్లంతా వాటిని రాయలేరు, పాడలేరు. దానికి ఎంతో కష్టపడాలి. ప్రాక్టీస్ చేయాలి. అన్నింటికీ మించి రాయాలి, పాడాలి అనే కోరిక బలంగా ఉండాలి. ఆ తపన మనసులో ఉంటే సక్సెస్ అవ్వొచ్చు అనడానికి నిదర్శనం ఫోక్ సింగర్ వల్లపు స్వామి. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంటకు చెందిన స్వామికి చిన్నప్పటి నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం. స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్‌లో పాటలు పాడి స్టూడెంట్స్, టీచర్స్‌ను ఇంప్రెస్ చేసేవాడు. వాళ్ల ఎంకరేజ్‌మెంట్‌తో పాటలు పాడటం హాబీగా మార్చుకున్నాడు. జానపద గేయాలు ఎక్కువ ఇష్టపడేవాడు. దాంతోఎక్కువగా ఫోక్ సాంగ్సే పాడేవాడు. కొన్నేండ్లుగా ఫోక్ సాంగ్స్ రాసి, పాడుతూ కొన్ని ఆల్బమ్‌లు చేస్తున్నాడు. సింగర్‌గా, లిరిక్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వల్లపు మ్యూజిక్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. స్టేట్, నేషనల్ లెవల్స్‌లో అవార్డులు అందుకున్నాడు.
వంద జానపదాలు
టీవీలో వచ్చే ఫోక్ సాంగ్ ప్రోగ్రామ్స్ చూసి సొంతగా ప్రాక్టీస్ చేశాడు. ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ‘వెలుగు’ స్కీం ఒకటి తెచ్చింది అప్పటి ప్రభుత్వం. దానిగురించి గ్రామాల్లో ప్రచారం చేసేందుకు కళాకారులను అప్లై చేసుకోమన్నారు. అది చూసి, రామాయంపేట మండలం నుంచి పది మంది కళాకారులతో కలిసి టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు స్వామి. తన టీంతో కలిసి పాటలు పాడి అక్కడికి వచ్చిన ఆఫీసర్లను మెప్పించాడు. దాంతో ప్రభుత్వం తరఫున ప్రచారం చేసేందుకు స్వామిని సెలక్ట్ చేశారు. అప్పటి నుంచి స్వామికి ఫోక్ సింగర్‌గా అఫీషియల్ గుర్తింపు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఫుల్‌టైం పాటలు రాయడం, పాడటంపై ఫోకస్ పెట్టాడు. అలా ఇప్పటికి దాదాపు వంద జానపద గేయాలు రాశాడు. తను ఫోక్ సింగర్‌గా ఎదగడానికి ప్రజా గాయకుడు గద్దర్ ఇన్స్పిరేషన్ అంటాడు స్వామి.
‘‘యూట్యూబ్ ఛానెల్ చాలామంది చూస్తారు. అందుకే నేను పాడే ఫోక్ సాంగ్స్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలి అనుకున్నాను. అందుకోసం ‘వల్లపు మ్యూజిక్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నా. ఇందులో నేను పాడిన పాటలతోపాటు, వేరే వాళ్లు పాడిన సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటా. ఏ సాంగ్ అప్లోడ్ చేసినా లక్షలమంది చూస్తున్నారు. మెచ్చుకుంటున్నార’’ని చెప్పాడు స్వామి. వల్లపు మ్యూజిక్ ఛానెల్ నుంచి వచ్చే సాంగ్స్ ఎక్కువగా బావామరదళ్ల మధ్య సరదాలు, ఆట పట్టింపులు, పల్లె ప్రకృతి అందాలు, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల బెంగ కాన్సెప్ట్‌లతో ఉంటాయి. సీడీల హవా నడుస్తున్న టైంలో ఫస్ట్ టైం వన దుర్గమాత మీద రాసిన ‘నిండు పున్నమి తల్లి నిండుగున్నావే’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది స్వామికి. తెలంగాణ ఉద్యమంలో ‘వీర తెలంగాణ.. పోరు సాగుతోంది’, ‘సిల్లికుండలో సల్ల చేసిన’ పాటలతో పాటు కరోనా లాక్ డౌన్ టైంలో పోలీస్‌ల సేవలపై ‘పోలీస్ అన్న సలాం’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.మా ఛానెల్ కోసం లేటెస్ట్గా ఒక ఆల్బమ్ కంప్లీట్ చేశాం. మనిషి చనిపోయాక ఆత్మ తన గోస చెప్పుకోవడం అనే కాన్సెప్ట్ మీద ఒక సాంగ్ చేశాం. దాన్ని త్వరలో అప్లోడ్ చేస్తా. స్టేజ్ ప్రోగ్రామ్స్ ద్వారా కొద్దిపాటి ఆదాయం వస్తోంది. ఎప్పటికైనా ‘తెలంగాణ సాంస్కృతిక సారధి’ సంస్థ లో జాబ్ చేయాలనేది నా కోరిక.
::: శ్రీధర్, మెదక్, వెలుగు
