కష్టాల్లో నార్త్ కొరియా.. కాఫీ 7 వేలు, డజన్ అరటి 3 వేలు

కష్టాల్లో నార్త్ కొరియా..  కాఫీ 7 వేలు, డజన్ అరటి 3 వేలు

ప్యోంగ్‌‌యాంగ్: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాన ఫుడ్ ఐటమ్స్‌ ధరలు కొండెక్కాయి. ఆహార కొరతను అధినేత కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించారని అక్కడి ప్రభుత్వ అధికార న్యూస్ ఏజెన్సీ అయిన కొరియన్ సెంట్రల్ ప్రకారం తెలుస్తోంది. గతేడాది సంభవించిన టైఫూన్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కిమ్ జాంగ్ అన్నట్లు సమాచారం. టైఫూన్ వల్లే దేశ ప్రజల అవసరాలను తీర్చేంత ఆహార ధాన్యాలను వ్యవసాయ రంగం అందించలేకపోయిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆహార కొరతతో నార్త్ కొరియాలో చాలా ఫుడ్ ఐటమ్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. అందులో టీ, కాఫీతోపాటు అరటి పండ్లు కూడా ఉన్నాయి. దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని వ్యాపారులు ఒక డజన్ అరటి పండ్లను 45 డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.3,335)కు అమ్ముతున్నారని సమాచారం. బ్లాక్ టీ ఒక ప్యాకెట్ 70 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.5,190)కు, ప్యాకెట్ కాఫీ 100 డాలర్లు (భారత కరెన్సీలో రూ.7,414)కు అమ్ముతున్నారని తెలిసింది. దీన్ని బట్టి అక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఆహార కొరతను  సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సెంట్రల్ కమిటీని కిమ్ జాంగ్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగమించడానికి కొరియాకు 8.6 లక్షల టన్నుల ఫుడ్ అవసరమని అంచనా. అయితే కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో నార్త్ కొరియా బార్డర్ మూసేసి ఉంది.