ఆశ్రమ స్కూళ్లలో ఫుడ్‌‌పాయిజన్‌‌.. స్టూడెంట్లకు అస్వస్థత

ఆశ్రమ స్కూళ్లలో ఫుడ్‌‌పాయిజన్‌‌.. స్టూడెంట్లకు అస్వస్థత
  • ఖమ్మం జిల్లా కల్లూరు, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలాల్లో ఘటనలు

కల్లూరు, వెలుగు : ఫుడ్‌‌ పాయిజన్‌‌ కారణంగా పలువురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్‌‌ఎస్పీ క్యాంప్‌‌ ఆవరణలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం ఉదయం స్టూడెంట్లకు బ్రేక్‌‌ఫాస్ట్‌‌ కింద కిచిడీ పెట్టారు. తిన్న తర్వాత 15 మంది స్టూడెంట్లు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. గమనించిన వార్డెన్‌‌, టీచర్లు స్టూడెంట్లను స్థానిక హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. 

విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌ నాయకులు హాస్టల్‌‌కు వెళ్లే సరికే మరికొంత మంది అస్వస్థతకు గురికావడంతో వారిని సైతం హాస్పిటల్‌‌కు తరలించారు. మొత్తం 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి, కల్లూరు సబ్‌‌ కలెక్టర్‌‌ అజయ్‌‌ యాదవ్‌‌ హాస్పిటల్‌‌కు చేరుకొని స్టూడెంట్లను పరామర్శించారు. తాహసీల్దార్‌‌ సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్‌‌ హాస్టల్‌‌ను పరిశీలించారు. 

హాస్టల్‌‌ వార్డెన్‌‌, వర్కర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

స్టూడెంట్లను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌‌ను సందర్శించి వంటలను పరిశీలించారు. వంటలు నాసిరకంగా చేస్తున్నారని, వారం రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వార్డెన్‌‌, వర్కర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెబ్బన గురుకులంలో... 

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా రెబ్బెనలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్టూడెంట్లకు ఆదివారం మధ్యాహ్నం మటన్‌‌, సాయంత్రం పప్పు, కూర పెట్టారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు స్టూడెంట్స్‌‌ కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. గమనించిన హాస్టల్‌‌ సిబ్బంది వెంటనే రెబ్బన పీహెచ్‌‌సీకి తరలించారు. ఫస్ట్‌‌ ఎయిడ్‌‌ అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌‌కు అక్కడి నుంచి మంచిర్యాల హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. 

ఒక స్టూడెంట్ల్‌‌ డిశ్చార్జ్‌‌ కాగా.. మిగిలిన ఇద్దరు ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం మరో స్టూడెంట్‌‌ కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో పీహెచ్‌‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. స్టూడెంట్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

మొగుళ్లపల్లి కస్తూరిబాలో...

మొగుళ్లపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల కస్తూరిబాలో ఫుడ్‌‌ పాయిజన్‌‌ కావడంతో స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా కిచిడీ తిన్న తర్వాత 18 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన సిబ్బంది వారిని చిట్యాల హాస్పిటల్‌‌కు తరలించారు. 

విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాస్పిటల్‌‌కు వచ్చి స్టూడెంట్లను పరామర్శించారు. అనంతరం స్కూల్‌‌కు వెళ్లగా... వారం రోజుల నుంచి ఫుడ్‌‌ క్వాలిటీగా ఉండడం లేదని స్టూడెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పుడ్‌‌ పాయిజన్‌‌ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాస్పిటల్‌‌కు చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు.