
హైదరాబాద్ లో ఇండ్లే గోదాములయ్యాయి. లోడ్లకు లోడ్లు మామిడి కాయలు తెప్పించుకోవడం.. ప్రభుత్వ నిషేదిత పదార్థాలతో మాగబెట్టడం.. పండ్లు నిగనిగలాడే రంగు వచ్చాక మంచి ధరకు అమ్ముకోవడం.. ఇది వ్యాపారులు చేస్తున్న మోసం. ప్రజలు, పిల్లలు ఏమైపోయినా పర్లేదు. ఎవరి ఆరోగ్యాలతో వీరికి పట్టదు. సంపాదనే ముఖ్యం. అలాంటి వ్యాపారులను శనివారం (మే 10) అరెస్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
శనివారం మధ్యాహ్నం మామిడిపండ్ల గోదాములలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు తనిఖీలు నిర్వహించారు. అదే క్రమంలో గోదాంలలో కాకుండా ఇండ్లలో పోసి పండ్లు మాగబెడుతున్న వ్యాపారుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్ ను వినియోగిస్తూ.. కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మాగబెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సలీమ్ నగర్ గోదాంలో రూ.60 వేల విలువైన కాయలను, శాలివాహన నగర్ లో రూ.3లక్షల 50 వేల విలువైన పక్వాని కోసం మాగబెట్టిన కాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ కకృతికి పాల్పడిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
►ALSO READ | హైదరాబాద్లో వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు.. నిందితుల్లో జైలు వార్డెన్, ఏపీ కానిస్టేబుల్
ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టేందుకు ఎథిలైన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటిలైడ్ వంటి కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అదేవిధంగా పిల్లలో హార్మోనల్ ఇంబాలెన్స్ (హార్మోన్ల అసమతుల్యత) ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కాల్షియం కార్బైడ్ ను పూర్తిగా నిషేధించినా వాడుతున్నారని.. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.