వాడిన నూనె వినియోగం, కృత్రిమ రంగులు.. హైదరాబాద్లో ఆరుగురు అరెస్ట్

వాడిన నూనె వినియోగం, కృత్రిమ రంగులు.. హైదరాబాద్లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌‌ఫోర్స్ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్‌‌ఫాస్ట్), జీహెచ్‌‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. 

బహదూర్‌‌పురాలోని కోప్ ఆప్రో టెక్ లిమిటెడ్(నూనె, బియ్యం రీప్యాకింగ్), కిషన్‌‌బాగ్‌‌లోని స్నాజీ ఐస్‌‌క్రీమ్, సికింద్రాబాద్ మైలార్‌‌గడ్డలోని వీరభద్ర ఎంటర్‌‌ప్రైజెస్, ట్విన్ సిటీస్ ఎంటర్‌‌ప్రైజెస్(మురుకుల తయారీ), మల్కాజ్‌‌గిరిలోని ఎస్‌‌ఎస్ బేకరీ, బేగంబజార్‌‌లోని ఎంఎం కిరాణా అండ్ డ్రైఫ్రూట్స్ స్టోర్స్‌‌లలో తనిఖీలు చేపట్టారు. 

ఈ సందర్భంగా వాడిన వంట నూనె, కృత్రిమ రంగులు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్​కు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.

  • అపరిశుభ్రంగా..

తనిఖీల్లో ఆయా సంస్థలు అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాడిన నూనెనే మళ్లీ వాడడం, కృత్రిమ రంగులు కలపడం, గడువు ముగిసిన, నకిలీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించడం, ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్స్ లేకుండానే వ్యాపారం నిర్వహించడం వెలుగుచూసింది. సిబ్బంది గ్లౌజులు, హెయిర్‌‌నెట్లు ధరించకపోవడం, తయారీ కేంద్రాల్లో ఈగలు, బొద్దింకలు ఉండడం వంటి పలు లోపాలను అధికారులు గుర్తించారు.