- మూడు రోజులపాటు నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
- ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమేనంటూ కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో పాటు చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు వీలుగా, లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కి పెంచే లక్ష్యంతో కూడిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను పాస్ చేసేందుకే ఈ స్పెషల్ సెషన్ జరగనుంది.
అయితే, నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీలో ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక బిల్లులను ఆమోదింపచేసుకుని, రాజకీయ లబ్ధి పొందడం కోసమే కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని శనివారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం హడావుడిగా చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ "ప్రమాదకరమైన పరిణామాలకు" దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
"తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రభావితం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే ఈ ప్రత్యేక సమావేశం ఏకైక ఉద్దేశం. పార్లమెంట్ సమావేశాలను మరో15 రోజుల తర్వాత ఎందుకు ఏర్పాటు చేయకూడదు?" అని జైరాం ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించడం గురించి మాత్రమే పేర్కొందని, డీలిమిటేషన్ పై అధికారిక సమాచారం లేదా ప్రతిపాదన ఏదీ లేదని తప్పుపట్టారు.
ఈ విషయంలో తొందరపాటు వద్దని.. జాగ్రత్తగా వ్యవహరించకపోతే తమిళనాడు, కేరళ వంటి పలు రాష్ట్రాలు గణనీయంగా నష్టపోతాయన్నారు. "ప్రతిపాదిత బిల్లుతో ఉత్తరప్రదేశ్ బలం 120కి పెరుగుతుంది, కేరళ గరిష్టంగా 30కి మాత్రమే చేరుకుంటుంది" అని ఆయన వాదించారు. కాగా, రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఈ నెల 16లోపు ఇతర ప్రతిపక్ష నాయకులతో చర్చించి, ఈ అంశంపై పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహరచన చేయనున్నారు.
- చర్చలో ప్రతిపక్ష సభ్యులంతా పాల్గొనాలి: మోదీ
దేశవ్యాప్తంగా వచ్చే జనరల్ ఎలక్షన్స్(2029) నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చించేందుకు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మరో మూడు రోజుల పాటు (ఈ నెల16, 17, 18 తేదీల్లో) పొడిగిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఆయన కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా పథనంతిట్టలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
"చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం' అమలుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్లమెంటులో మూడో వంతు సీట్లలో మన సోదరీమణులు ఉండాలని మేం కోరుకుంటున్నాం. మన మాతృమూర్తులు, సోదరీమణుల హక్కులు దాదాపు 40 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఇకపై ఆలస్యం చేయకూడదు. మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు పార్లమెంట్ సమావేశాలను పొడిగిస్తున్నాం. కోటాను అమలులోకి తీసుకురావడానికి అవసరమైన శాసన, రాజ్యాంగపరమైన చర్యలతో సహా అన్ని నిబంధనలపై ఈ స్పెషల్ సెషన్ దృష్టి సారిస్తుంది. చర్చలో కాంగ్రెస్, ఇండియా బ్లాక్‌లోని సభ్యులతో సహా ఇతర ప్రతిపక్ష సభ్యులు పాల్గొనాలి" అని కోరారు.
