ఆయిల్​ పామ్​ కోసం  రూ. 11,040 కోట్ల స్కీము 

ఆయిల్​ పామ్​  కోసం  రూ. 11,040 కోట్ల స్కీము 
  •  దిగుమతులు తగ్గించేందుకే  పామాయిల్​ ప్రొడక్షన్​
  • 28 లక్షల టన్నులకు పెంచాలని టార్గెట్​

న్యూఢిల్లీ: దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే టార్గెట్​తో రూ. 11,040 కోట్లతో వంట నూనెల (ఎడిబుల్​ ఆయిల్​) కోసం నేషనల్​ మిషన్​ను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా పామ్​ ఆయిల్​ ప్రొడక్షన్​ పెంచేందుకు ఈ మిషన్​ కింద చొరవ తీసుకోనున్నారు. ఈ నేషనల్​ మిషన్​ ప్రపోజల్​కు బుధవారం కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు (నార్త్​ ఈస్టర్న్​ స్టేట్స్​), అండమాన్​, నికోబార్​ దీవులపై ఈ మిషన్​ ప్రత్యేక ఫోకస్​ పెట్టనుంది. వంట నూనెల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తున్న నేపథ్యంలో ఈ నేషనల్​ మిషన్​ను తెస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశీయంగా వంట నూనెల సాగును, దిగుబడిని పెంచాలనేదే ఈ మిషన్​ టార్గెట్‌ అని కేబినెట్​ సెక్రటేరియట్​ ఒక స్టేట్​మెంట్లో  వివరించింది. 
కేంద్రం రూ. 8,844 కోట్లు...
కొత్త స్కీము కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,844 కోట్లను సమకూర్చనుండగా, రాష్ట్రాలు మిగిలిన రూ. 2,196 కోట్లను సమకూర్చ వలసి ఉంటుంది. 2026 నాటికి దేశంలో ఆయిల్​ పామ్​ సాగును మరో 6.5 లక్షల హెక్టార్లు పెంచాలని, దీంతో 10 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా దేశంలో క్రూడ్​ పామాయిల్​ (సీపీఓ) ప్రొడక్షన్ 2026 నాటికి 11.20 లక్షల టన్నులకు, ఆ తర్వాత 2030 నాటికి 28 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ఆయిల్​ పామ్​ రైతులకు ప్రధానంగా ఈ స్కీము ఉపయోగపడనుంది. ఆయిల్​ పామ్​ సాగులో పెట్టుబడులు పెంచడంతోపాటు, ఉద్యోగావకాశాలనూ కల్పిస్తుందని, అన్నింటికీ మించి దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తుందని ప్రభుత్వం ఈ స్టేట్​మెంట్లో పేర్కొంది.​ ఆయిల్​ పామ్​ రైతులు ఫ్రెష్​ ఫ్రూట్​ బంచెస్​ (ఎఫ్​ఎఫ్​బీ) ఉత్పత్తి చేస్తారు. వీటి నుంచే పామాయిల్​ను తయారు చేస్తారు.