మూడేండ్లలో కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే

మూడేండ్లలో కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే
  • కేంద్రానికి రాసిన లెటర్​లో రాష్ట్ర ప్రభుత్వం
  • చెరువులన్నీ పునరుద్ధరించామని వెల్లడి
  • మూడేండ్లలో కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే
  • శివమ్‌‌ మీటింగ్‌‌ మినిట్స్‌‌లో ఈ ప్రాజెక్టు పేరే లేదు

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు పెరిగిందని ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మొత్తం 41 వేల చెరువులను పునరుద్ధరించడమూ వరి సాగు పెరగడానికి ఇంకో కారణమని చెప్పింది. 24 గంటల కరెంటు ఇవ్వడంతో కూడా రైతులు వరి ఎక్కువగా వేశారంది. ఫలితంగా రాష్ట్రంలో పండే కోటి 35 లక్షల మెట్రిక్‌‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈమధ్య రాసిన లెటర్​లో కోరింది. అయితే కాళేశ్వరం నీళ్లతోనే 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వం చెప్తున్నా ఆ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. 41 వేల చెరువులు పునరుద్ధరించామని అంటున్నా ఆ లెక్క 21,605 మాత్రమే. భారీ వర్షాలతో రాష్ట్రంలో నీటి లభ్యత పెరిగిందని, తద్వారా వరిసాగు పెరిగిందని చెప్పకుండా కాళేశ్వరం, మిషన్‌‌ కాకతీయకు మైలేజ్‌‌ పెంచే ప్రయత్నం చేసింది.

కనీసం పంట కాల్వలూ తవ్వలే

కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌‌ 21న అధికారికంగా ప్రారంభించారు. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. కనీసం రిజర్వాయర్ల కింద పంట కాల్వలూ తవ్వలేదు. కేవలం రిజర్వాయర్లలో నీళ్లు నింపడం మినహా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన ప్రయోజనం ఏదైనా ఉందంటే ఎల్‌‌ఎండీకి దిగువన ఎస్సారెస్పీ స్టేజ్‌‌-1, స్టేజ్‌‌-2 ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందడమే. ఎస్సారెస్పీ ఆయకట్టు స్టెబిలైజేషన్‌‌ మినహా ఈ ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రయోజనమేదీ రాలేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ కూడా అంగీకరిస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లకు ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల్లో ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయో, ఎంతమేరకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వొచ్చో ఈఎన్సీ నేతృత్వంలోని శివమ్‌‌ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇస్తారు, అందుకు ఎన్ని నీళ్లు అవసరమో నిర్ధారించి ఆ వివరాలతో శివమ్‌‌ మీటింగ్‌‌ మినిట్స్‌‌ రిలీజ్‌‌ చేస్తారు. 2020–21 యాసంగి సీజన్‌‌లో మినహా ఇంకెప్పుడు శివమ్‌‌ మినిట్స్‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదు.

ఎత్తి పోసిన నీళ్లు వృథాగా సముద్రంలోకి

ఇరిగేషన్‌‌ రీ ఆర్గనైజేషన్‌‌ తర్వాత శివమ్‌‌ మినిట్స్‌‌ను ప్రాజెక్టుల వారీగా కాకుండా చీఫ్‌‌ ఇంజనీర్ల టెరిటరీ ఆధారంగా ప్రకటిస్తున్నారు. ఈ వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఈఎన్సీలు రామగుండం, గజ్వేల్‌‌, ఇతర చీఫ్‌‌ ఇంజనీర్లు పాత ప్రాజెక్టుల కిందనే ఆయకట్టు ప్రతిపాదించారు. ఈ వానాకాలంలో మేడిగడ్డ నుంచి 35 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసినా తర్వాత భారీ వర్షాలు కురవడంతో ఆ నీళ్లన్నీ వృథాగా నదిలోకే వదిలేశారు. నిరుడు యాసంగిలో కాళేశ్వరం నీళ్లు గజ్వేల్‌‌ ఈఎన్సీ పరిధిలో 35,838 ఎకరాలకు ఇవ్వాలని ప్రతిపాదించినా ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఈ వానాకాలం సీజన్‌‌లో ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రతిపాదించలేదు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం ఆ ప్రాజెక్టు కారణంగానే సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు పెరిగిందని కేంద్రానికి చెప్పడంపై ఇరిగేషన్‌‌ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.