
ఈ చిన్నోడి పేరు సిద్ధార్థ్ ధాగే! వయసు పదేళ్లు! మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సమీపంలోని ముకుంద్వాడిలో ఉంటాడు. రెండో క్లాసు చదువుతున్నాడు. భుజంపై పుస్తకాలు మోయాల్సిన వయసులో.. బిందెలు ఎత్తుకుంటున్నాడు. రోజూ అతడి కాళ్లు స్కూలు వైపు కాకుండా నీళ్ల కోసం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరివైపు పడతాయి. పొద్దున్నే ఔరంగాబాద్– హైదరాబాద్ ప్యాసింజర్ రైలు వస్తుంది. ఆ రైలును అందుకోవాలి. ప్రయాణం చేసి నీళ్లు తేవాలి. అతడొక్కడే కాదు.. చాలా మంది చిన్న పిల్లల పరిస్థితి అదే. 12 ఏళ్ల ఆయేషా గరుడ్, తన చెల్లి 9 ఏళ్ల సాక్షితో కలిసి అదే రైల్లో నీళ్లు తేవడానికి వెళ్తుంది. వాళ్ల కథలే మహారాష్ట్రలోని మరాఠ్వాడా రీజియన్‌లో కరువు ఎంతలా పట్టి పీడిస్తోందో చెబుతుంది. 7 వేల గ్రామాలపై కరువు కాటు పడింది. ఒక్క బకెట్ నీళ్లు దొరకాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. లక్షలాది మంది మహిళలు, పిల్లలు కరువు ధాటికి భారంగా బతుకు గడుపుతున్నారు.
రైల్వే స్టేషన్ నీళ్లే దిక్కు…
సిద్ధార్థ్ నీటి ప్రయాణం మరింత కష్టంతో కూడుకున్నది. ఎండ నడినెత్తి మీదికొచ్చే మధ్యాహ్నం టైంలో రెండు బిందెలు పట్టుకుని ముకుంద్వాడి రైల్వే స్టేషన్‌కు బయల్దేరతాడు. అక్కడ ట్రైన్ ఎక్కి 7 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్‌కు చేరుకుంటాడు. స్టేషన్‌లోని ట్యాప్‌ల నుంచి నీళ్లు పట్టుకుని మళ్లీ రైలెక్కుతాడు. సాయంత్రం 5.30 గంటలకు గానీ ఇంటికి చేరడు. 7+7 కిలోమీటర్ల ప్రయాణమంటే అరగంట కూడా పట్టదు. కానీ, అక్కడ రైళ్లు ఎప్పుడూ ఆలస్యమే. అందుకే అతడి 14 కిలోమీటర్ల ప్రయాణం గంటలు సాగుతుంది. వచ్చిన రైలూ ఎంతో సేపు ఆగదు. ఆలోపు రైలెక్కేసేయాలి. గుంపులో తోసుకుంటూ ఎక్కే క్రమంలో కొన్నిసార్లు సిద్ధార్థ్‌కు దెబ్బలు కూడా తగిలాయి. రైలెక్కాక బిందెలను అక్కడ పెట్టేసి రైలు ఫ్లోర్‌పై కూర్చుంటాడు. స్టేషన్‌కు వచ్చాక అతడి తల్లి జ్యోతి వచ్చి ఆ బిందెలను కిందకు దించుతుంది.
వేరే గత్యంతరం లేదు…
ఇది ప్రమాదమే అయినా నీళ్లు తెచ్చుకునేందుకు అంతకు మించి గత్యంతరం లేదని సిద్ధార్థ్ తల్లి జ్యోతి చెబుతోంది. ఆయేషా, సాక్షి తల్లిదండ్రుల మాట కూడా అదే. ప్రైవేట్ స్కూల్లో వాళ్లిద్దరినీ చేర్పించినా పుస్తకాలు, యూనిఫాంలు కొనలేని దీనస్థితి అని వాపోతున్నారు. ఇక, ముకుంద్వాడికి పక్కనే ఉన్న నిర్మలా దేవి నగర్లో కనీసం నల్లా సౌకర్యం కూడా లేదు. 300 గడపలుంటాయి. నీళ్లు కావాలంటే ₹60 పెట్టి 200 లీటర్ల డ్రమ్మును కొనుక్కోవాల్సిందే. అదీకాకపోతే, నాలుగు రోజులకోసారి మాత్రమే మున్సిపల్ వాటర్ ట్యాంకర్లు వస్తుంటాయి. నెల పేరు మీద ఒక్కో ఇల్లు 1,150 రూపాయలు దానికి చెల్లించాలి. అయితే, ఇంత జరుగుతున్నా తామేం చేయలేమంటూ ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) మేయర్ నందకుమార్ ఘొడెలే చేతులెత్తేశారు. టైంకు మంచినీళ్లివ్వడమొక్కటి చేయగలమన్నారు.