V6 News

మహిళల కోసం…అమెజాన్‌ సహేలి

మహిళల కోసం…అమెజాన్‌ సహేలి

కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమం, మహిళా సాధికారతకు నిర్దేశించిన కుడుంబశ్రీ విభాగంతో అమెజాన్‌ ఇండియా అగ్రిమెంట్ చేసుకుంది. కేరళ ప్రభుత్వంతో కలిసి అమెజాన్‌ సహేలి పథకాన్ని నిర్వహిస్తున్నది. ఈ పథకం భాగస్వామ్యం కింద అమెజాన్‌ ఇండియా శిక్షణ, మద్దతునిచ్చి మహిళా పారిశ్రామికవేత్తల సాధికారతకు తోడ్పడుతోందని తెలిపారు అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రణవ్ భాసిన్. అంతేకాకుండా వారి ఉత్పత్తులను అమెజాన్‌ కస్టమర్లకు చేరువ చేస్తుందని తెలిపింది.

సుమారు వెయ్యికి పైగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీలతో సుమారు 10లక్షల మంది మహిళలకు కేరళలోని 14 జిల్లాల్లో ఆర్ధిక మద్దతును, స్వావలంబనను చేకూరుస్తోంది. సహేలి టీమ్‌ ఈమహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. ఎలాంటి ఖర్చులేకుండా ఆన్ లైన్‌ లోనే వారి ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే వారికి ఎప్పుడూ ఆన్‌ లైన్‌ సేల్స్ లో సాయం అందిస్తుంది. వారి ఉత్పత్తుల ఫొటోలు, కేటాలాగ్‌, ఉత్పత్తుల లిస్టు చేయడం, రిఫరల్‌ ఫీజుల్లో సబ్సిడీ, ఉచిత ఖాతా నిర్వహణ వంటి వాటిలో సాయం అందిస్తోంది.

కిరాణా, గృహ, ఫ్యాషన్‌ రంగాలకు సంబంధించి ప్రత్యేకించి మహిళలే తయారు చేసిన ఉత్పత్తులకు అమెజాన్‌ తన ఆన్‌ లైన్‌ పోర్టల్‌లో భాగస్వామ్యం కల్పిస్తున్నది. అమెజాన్‌ ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఉత్పత్తులను జతచేసింది. కిరాణా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు అమెజాన్‌ మంచి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ పైలట్‌ స్కీం కింద మొదటి మూడు వారాల్లోను హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయి.