ఫోర్బ్స్​ గ్లోబల్​ 2000 లిస్టులో.. రిలయన్స్​కి 45 ప్లేస్

ఫోర్బ్స్​ గ్లోబల్​ 2000 లిస్టులో.. రిలయన్స్​కి 45 ప్లేస్

న్యూఢిల్లీ: ఫోర్బ్స్​ తాజాగా ప్రకటించిన గ్లోబల్​ 2000 కంపెనీల జాబితాలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ 45 వ ప్లేస్​ దక్కించుకుంది. అంతకు ముందుతో పోలిస్తే ఈ కంపెనీ 8 ర్యాంకులు ఎగబాకింది. ఒక ఇండియన్​ కంపెనీకి ఇప్పటిదాకా ఫోర్బ్స్​గ్లోబల్​ 2000 లిస్టులో వచ్చిన హయ్యస్ట్​ ర్యాంక్​ నలభై అయిదే. ప్రపంచంలోని లిస్టెడ్​ కంపెనీలను మాత్రమే ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. సేల్స్​, ప్రాఫిట్స్​, ఎసెట్స్​, మార్కెట్​ వాల్యూ అనే నాలుగు మెట్రిక్స్​ ఆధారంగా గ్లోబల్​ 2000 లిస్టును ఫోర్బ్స్​ ప్రకటిస్తుంది. 3.7 ట్రిలియన్​ డాలర్ల ఎసెట్స్​తో  అమెరికాలోనే  పెద్ద బ్యాంకయిన జేపీ మోర్గాన్​ ఫోర్బ్స్​ గ్లోబల్​2000 జాబితాలో టాప్​ప్లేస్​లో నిలిచింది. 

2011 నుంచి చూస్తే జేపీ మోర్గాన్​ ఇలా టాప్​ప్లేస్​కి చేరడం ఇదే మొదటిసారి. కిందటేడాది టాప్​లో నిలిచిన వారెన్​ బఫెట్​ కంపెనీ బెర్క్​షైర్​ హాథవే ఈసారి 338 వ ర్యాంకుకు పడిపోయింది. ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్​ఫోలియోలోని అన్​రియలైజ్డ్​ లాసెస్​ వల్లే ఈ కంపెనీ తన ర్యాంకును పోగొట్టుకున్నట్లు ఫోర్బ్స్​ తెలిపింది. సౌదీ అరేబియా ఆయిల్​ కంపెనీ ఆరామ్​కో 2 వ ర్యాంకును పొందగా, ఆ తర్వాత మూడు ప్లేస్​లలోనూ చైనా ప్రభుత్వ బ్యాంకులు నిలిచాయి. టెక్నాలజీ కంపెనీలు ఆల్ఫాబెట్​7 వ ప్లేస్​లోను, యాపిల్​ 10 వ ప్లేస్​లోనూ తాజా ఫోర్బ్స్​గ్లోబల్​2000 లిస్టులో నిలిచాయి. ఆయిల్​ నుంచి టెలికం దాకా తన కార్యకలాపాలను విస్తరించుకున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ 45 వ ప్లేస్​లో నిలిచింది. ఈ కంపెనీ సేల్స్​ 109.43 బిలియన్​ డాలర్లయితే, ప్రాఫిట్స్​ 8.3 బిలియన్​ డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రిలయన్స్​ 8 ర్యాంకులు పైకి ఎగబాకింది.

 జర్మనీ కంపెనీ బీఎండబ్ల్యూ గ్రూప్​, స్విట్జర్లాండ్​ కంపెనీ నెస్లే, చైనా కంపెనీ అలీబాబా, అమెరికా కంపెనీ ప్రోక్టర్​ అండ్​ గ్యాంబుల్​, జపాన్​ కంపెనీ సోనీల కంటే రిలయన్స్​ఇండస్ట్రీస్​ ముందు నిలిచిందని ఫోర్బ్స్​ వెల్లడించింది. మన దేశం నుంచి ఎస్​బీఐ 77 వ ప్లేస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​128 వ ప్లేస్​, ఐసీఐసీఐ బ్యాంక్​ 163 వ ప్లేస్​ పొందాయని పేర్కొంది. ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ఐసీ, టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఎల్ అండ్​ టీ, భారతి ఎయిర్​టెల్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, ఐఓసీ, ఇన్ఫోసిస్​, బీఓబీ, కోల్​ ఇండియా, టాటా స్టీల్​, హిందాల్కో, వేదాంత వంటి కంపెనీలు తాజా లిస్టులో ర్యాంకులు సాధించాయని ఫోర్బ్స్​ తెలిపింది.