సాయం చేస్తూ.. ఫోర్బ్స్​కి ఎక్కిండు

సాయం చేస్తూ.. ఫోర్బ్స్​కి ఎక్కిండు

కడుపునిండా కూడు దొరకని బతుకులు కొందరివి. కూసింత గూడు, ఒంటినిండా బట్ట కోసం కాయకష్టం చేసే జీవితాలు ఇంకొన్ని. ప్రాణం మీదకొస్తే సాయం కోసం చూసేటోళ్లు ఇంకొందరు. ఇలా ఒక్కొక్కళ్లది ఒక్కో కథ.. కానీ, నలుగురూ చెయ్యందిస్తే వీళ్ల కన్నీళ్లు తుడవడం పెద్ద సమస్యేం కాదు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే డొనేట్ కార్ట్​ సంస్థ. ఈ స్టార్టప్​ని మన తెలుగబ్బాయిలు సందీప్‌‌‌‌‌‌‌‌ శ్రీవాత్సవ శర్మ,  అనిల్ రెడ్డి  మొదలుపెట్టారు. ఈ మంచి ఆలోచన వీళ్లని ఫోర్బ్స్​ ఇండియా –30 అండర్​ 30 గ్రూపు ఎన్జీవోలు–సోషల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌‌‌ లిస్ట్​లో  మోస్ట్​ ఎఫెక్టివ్​ పర్సన్స్​గా నిలబెట్టింది. ఈ సందర్భంగా సందీప్​ శ్రీవాత్సవతో లైఫ్​ మాట్లాడింది.
‘‘ఆపదలో ఉన్నోళ్లకి సాయం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ, ఎవరి అవసరం ఏంటో తెలియదు. సాయం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో కూడా తెలియదు. ఇటు చూస్తే కష్టమొస్తే  ఎవర్ని సాయం అడగాలో  తెలియనివాళ్లు. వీళ్లిద్దరి మధ్య బ్రిడ్జ్​గా వచ్చిందే మా డొనేట్‌‌‌‌కార్ట్‌‌‌‌.కామ్‌‌‌‌. దీన్ని 2017 లో నా ఫ్రెండ్​ అనిల్​ రెడ్డితో కలిసి మొదలుపెట్టా. ఆ తర్వాత  సారంగ్‌‌‌‌ బొబాడే అనే మరో ఫ్రెండ్​ కూడా మాకు తోడయ్యాడు. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది కన్నీళ్లు తుడిచిన మా సంస్థకి బీజం నా చిన్నప్పుడే పడింది. నలుగురి బాగు కోసం చిన్నప్పట్నించీ నేను పడిన ఆరాటానికి రూపమే డొనేట్​ కార్ట్​​. కామ్​. 
 

సాయం చేయాలని...
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయి మా సొంతూరు. పదో క్లాస్​ వరకు అక్కడే చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్​లో ఇంటర్​ పూర్తిచేసి, నాగ్​పూర్​ ఎన్​ఐటీలో కెమికల్​ ఇంజినీరింగ్​లో చేరా. ఆపదలో ఉన్నవాళ్లకి చేతనైనంత సాయం చేస్తుండేవాళ్లు మా అమ్మానాన్న. నాతో కూడా పేదవాళ్లకి డబ్బులు, అవసరమైన వస్తువులు ఇప్పించేవాళ్లు. అలా తెలియకుండానే సోషల్​ సర్వీస్​ చిన్నప్పట్నించీ నా జీవితంలో ఒక భాగమైంది. పెరిగి పెద్దయ్యేకొద్దీ నాతో పాటు నలుగురికీ సాయ పడాలన్న ఆశయం కూడా బలపడింది. నా ఆలోచనకి ఎన్​ఐటీలో అనిల్​ కూడా తోడయ్యాడు. ఇద్దరం కలిసి నాగ్​పూర్​లోని గవర్నమెంట్​ స్కూల్​​ స్టూడెంట్స్​​కి క్లాసులు చెప్పడం  మొదలుపెట్టాం. ఆ ప్రాసెస్​లో ఒక్క రూపాయికే స్టూడెంట్స్​​కి నోట్​బుక్స్​ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. అందుకోసం ఆ చుట్టుపక్కలున్న వ్యాపార సంస్థల్ని కాంటాక్ట్​ అయ్యాం. వాళ్ల బిజినెస్​ అడ్వర్టైజ్​మెంట్స్​ నోట్​ బుక్స్​ మధ్యలో వచ్చేలా ప్లాన్​ చేసి, ఒక్క రూపాయికే పిల్లలకి నోట్​ బుక్స్​ ఇప్పించాం. ఆ ఇన్​స్పిరేషన్​తో  సోషల్​ సర్వీస్​ వైపు వెళ్లాలనుకున్నా. ఆ టైంలోనే టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌ ‘జాగ్రితి యాత్ర’​ టీమ్​కి ఎంపికయ్యా. ఆ జర్నీ నా లైఫ్​ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. 
 

ఎన్జీవోలను కలిశా
జాగ్రితి యాత్ర ద్వారా కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ నుండి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్న వివిధ ఎన్​జీవోలను కలిశా. వాళ్లు సొసైటీ కోసం చేస్తున్న మంచి పనుల్ని దగ్గర్నుంచి చూశా. వలంటీర్లతో మాట్లాడి వాళ్లు ఏ ఇష్యూ ఎలా డీల్ చేస్తారన్నది తెలుసుకున్నా. వాటన్నింటి వల్ల సోషల్​ సర్వీస్​పై గౌరవం పెరిగింది. సోషల్​ సర్వీస్​ని రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యా. ఇదే విషయం అనిల్​తో చెప్తే తను కూడా సోషల్​ సర్వీస్​ చేద్దాం అన్నాడు. అయితే అప్పటికే ఇద్దరికీ క్యాంపస్​ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ, అవి వద్దనుకొని 2017లో డొనేట్​ కార్ట్​​ స్టార్టప్ వైపు అడుగులేశాం.
 

దేశంలో మూడో ప్లేస్​ 
ముందుగా సాయం చేసేవాళ్లకి, తీసుకునేవాళ్లకి మధ్యవర్తులుగా ఉండాలన్న మా ఆలోచనని  స్టార్టప్‌‌‌‌‌‌‌‌ కంపెనీల ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌లో ప్రెజెంట్‌‌‌‌‌‌‌‌ చేశాం. దేశ వ్యాప్తంగా మా డొనేట్​ కార్ట్​ ఐడియా మూడో స్థానంలో నిలిచింది. దాంతో ఇన్ఫోసిస్​ కంపెనీ మమ్మల్ని ప్రమోట్​ చేయడానికి ముందుకొచ్చింది. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ కూడా మా స్టార్టప్​ కోసం ముంబైలో ఫ్రీగా ఆఫీసు స్పేస్​ ఇచ్చింది. అలా మొదలైన డొనేట్​ కార్ట్​​ సేవలు ఇప్పుడు దేశమంతా వ్యాపించాయి. మా ఇద్దరితో మొదలైన ఈ స్టార్టప్​లో ఇప్పుడు 70కు పైగా ఎంప్లాయీస్​ ఉన్నారు. సాయం చేసే ఎన్జీవోలకు కావాల్సిన సామాన్లని బల్క్‌‌‌‌గా కొనడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అలా ఈ సంవత్సరం మా స్టార్టప్​కి రూ.90 కోట్ల రూపాయల టర్నోవర్​ వచ్చింది. వాటితోనే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. అయితే కొవిడ్​ మొదటి వేవ్​ తర్వాత  మా సంస్థని హైదరాబాద్​కి షిఫ్ట్​ చేశాం. ఫ్యూచర్​లో మా సేవలు మరింత విస్తరించాలి అనుకుంటున్నాం.
                                                                                                                                                                                                       ::: ఆవుల మల్లికార్జున రావు, కోదాడ, వెలుగు

ఇలా సాయం చేస్తాం 
సాధారణంగా చాలామంది ఎన్జీజోలకి డబ్బు రూపంలోనే డొనేషన్స్​ ఇస్తుంటారు. కానీ, దీనివల్ల అవసరమైన వాళ్లకి సాయం అందిందో, లేదో తెలుసుకునే ఛాన్స్​ ఉండదు. కానీ, డొనేట్ కార్ట్​లో డోనర్స్  నేరుగా కష్టాల్లో ఉన్నవాళ్లకి సాయం చేస్తారు. ఆపదలో ఉన్న ఎవరైనా మా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో వాళ్ల పేరు, అవసరాన్ని  చెప్పొచ్చు. అప్పుడు డొనేట్‌‌‌‌కార్ట్​​ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో రిజిష్టర్​ అయ్యి ఉన్న ఎన్‌‌‌‌జీఓల ద్వారా డోనర్స్​ నేరుగా వాళ్లకి సాయం చేస్తారు. మా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్​ఫాంలో ఉన్న వస్తువులను ఎంచుకుని, వాటిని అవసరమైన వాళ్లకి అందిస్తారు. ఇలా ఇప్పటివరకు10లక్షల మంది దాతల సాయంతో 150 కోట్ల డొనేషన్స్​ కలెక్ట్​ చేశాం. ఫ్యూచర్​లో  ఐదువేల కోట్ల విరాళాలు  సేకరించాలని గోల్ పెట్టుకున్నాం.  మా  సంస్థకి ఫోర్బ్స్‌‌‌‌ ఇండియా అండర్‌‌‌‌ 30 గ్రూపు ఎన్జీవోలు–సోషల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌ షిప్‌‌‌‌లో చోటు దక్కడం ఆనందంగా ఉంది​.