ఫోర్‌‌ బేస్ మెంట్‌‌ గోడ కూలి మోటార్లు పడడంతో భారీ నష్టం

ఫోర్‌‌ బేస్ మెంట్‌‌ గోడ కూలి మోటార్లు పడడంతో భారీ నష్టం

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలో కీలకమైన కన్నెపల్లి పంప్​హౌస్​కు ఊహించని స్థాయిలో నష్టం జరిగింది. డీ వాటరింగ్​ కొలిక్కి రావడంతో జరిగిన విధ్వంసం కాస్తా బయటపడుతోంది.  ఫోర్‌‌ బేసిమెంట్‌‌ గోడ కూలి మోటార్లపైనే పడటంతో పంప్‌‌హౌస్​‌లోని ఎనిమిది బాహుబలి మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. పంప్‌‌హౌస్​‌లో అమర్చిన మూడు భారీ క్రేన్లు, లిఫ్ట్‌‌ సైతం మోటార్లపైనే పడడంతో ముందుకు జరిగాయి. దీంతో మొత్తం 17 మోటార్లలో 8 మోటార్లు ఎందుకు పనికిరాకుండా పోయినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కన్నెపల్లి పంప్‌‌హౌస్​‌లో కొద్ది రోజులుగా నీళ్లు తోడేయడంతో సోమవారం రాత్రి మోటార్లు బయటపడ్డాయి. అక్కడి పరిస్థితి చూసి ఇంజినీర్లు హతాశుయ్యారు. మొత్తం ఎనిమిది మోటార్లు ఎక్కడికక్కడ పగిలి పనికిరాకుండా పోయాయి. జులై 14న గోదావరికి వచ్చిన వరదలకు అన్నారం, కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌లు నీట మునిగడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శల ధాటిని  తట్టుకునేందుకు కనీసం క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే భారీ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌‌ కుమార్‌‌ కేవలం రూ.20 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, దానిని కూడా ఏజేన్సీలే భరిస్తాయని ప్రకటించారు. కానీ మళ్లీ 8 కొత్త మోటార్లను కొనాలంటే రూ.320 కోట్లకు పైగా ఖర్చు కానుంది. అలాగే పంప్‌‌హౌస్​లో అమర్చిన ఎలక్ర్టికల్‌‌ బోర్డులు, బ్యాటరీలు పనికిరాకుండా  పోయాయి. దీంతో ఒక్క కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌లోనే రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఇంజినీరింగ్‌‌ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులు.. మేఘా కాంట్రాక్ట్‌‌ సంస్థ నాసిరకం నిర్మాణాలు బయటపడకుండా ఉండటానికి డీ వాటరింగ్‌‌ ప్రక్రియను మొత్తం చాలా గోప్యంగా చేస్తూ వస్తోంది. ఎవరిని పంప్‌‌హౌజ్‌‌ దరిదాపుల్లోకి రానివ్వట్లేదు. మొబైల్‌‌ ఫోన్లను నిషేధించారు. 

పనికిరాకుండా పోయిన షాఫ్ట్​లు 

ఇంజనీర్లు చెప్తున్న ప్రకారం, మోటార్లలోని షాఫ్ట్ లు వంగిపోయి పనికి రాకుండా డ్యామేజీ అయ్యాయి. ఈ షాఫ్ట్ లు ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశాల నుంచి రావాల్సి ఉంది. పంపు హౌస్​లో ఒకటో మోటార్​కి, 5వ మోటార్​కి మధ్య ఉన్న లిఫ్ట్ పూర్తిగా విరిగిపోయి మోటర్ల మీద పడింది.డైలీ వర్క్ కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్లు కూడా విరిగి మోటర్ల పై పడ్డాయి.  పైనుంచి కిందికి సామాను దించే  3 క్రేన్లు కూడా విరిగి మోటార్లపైనే పడిపోయాయి. సుమారు 100 స్టార్టర్ లు, 12 మోటర్లు, 200 బ్యాటరీలు ఇతర ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మొత్తం నీటి మునిగి, సిమెంట్‌‌ కాంక్రీట్‌ బిల్లలు మీదపడి‌, బురద వల్ల పూర్తిగా పగిలిపోయి కన్పిస్తున్నాయి. మోటార్లలోకి వాటర్ పంపింగ్ చేసే అండర్ గ్రౌండ్ లోని  గేట్లు విరిగి మోటార్లపై పడ్డాయి. పంపులు వద్ద వాటర్ లోపలికి వచ్చే పిల్త్ కాంక్రీట్ వాల్ కూడా పూర్తిగా విరిగిపోయి వాటర్ ఫోర్స్ కి పంపులపై పడి డ్యామేజీ చేశాయి. మొత్తంగా చూస్తే కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ నష్టం రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఇంజినీర్లు అంటున్నారు. ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రభుత్వం, మేఘా కాంట్రాక్ట్‌‌ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫొటోలు, వీడియోలు లీక్‌‌ కాకుండా అడ్డుకుంటున్నారు.