వొడాఫోన్ ఐడియా షేర్లు 15% ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రభుత్వం కేవలం ఐదేళ్ల మారటోరియం ప్రకటించడంతో పడుతున్న షేర్లు

వొడాఫోన్ ఐడియా షేర్లు 15% ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రభుత్వం కేవలం ఐదేళ్ల మారటోరియం ప్రకటించడంతో పడుతున్న షేర్లు
  • వడ్డీ, జరిమానా రద్దు ఉంటుందని అంచనా వేసిన ఇన్వెస్టర్లు

    న్యూఢిల్లీ: 

కేంద్ర ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ బకాయిల్లో రిలీఫ్ ఇచ్చినా  కంపెనీ షేర్లు బుధవారం 15 శాతం పతనమయ్యాయి. మంగళవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా  11.5శాతం వరకు పడ్డాయి. కంపెనీ షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15శాతం వరకు తగ్గి రూ.10.25కి చేరాయి. గత వారం 52-వారాల గరిష్టం రూ.12.8 తాకిన తర్వాత ఈ పతనం వచ్చింది. చివరికి షేర్ ధర రూ.10.67 వద్ద ముగిసింది. వడ్డీ, జరిమానాలపై మాఫీ ఉంటుందని ఇన్వెస్టర్లు అంచనా వేయగా, ప్రభుత్వం మారటోరియం (రీపేమెంట్ వాయిదా) మాత్రమే ఇవ్వడంతో షేర్లు పడుతున్నాయి. 

తీవ్ర ఇబ్బందుల్లో..

వొడాఫోన్ ఐడియా అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకుల నుంచి నిధులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కంపెనీకి 18 వేల మంది ఉద్యోగులు, 19.80 కోట్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. కొన్ని వారాల క్రితం సుప్రీం కోర్టు 2016–17 వరకు ఉన్న బకాయిలను మళ్లీ సమీక్షించేందుకు అనుమతించింది. 

దీంతో డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ (డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కమిటీ ఏజీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలను మళ్లీ లెక్కించి, వడ్డీ, జరిమానా రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది.  ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. 2025 మార్చిలో రూ.36,950 కోట్ల బకాయిలను ఈక్విటీలోకి మార్చి తన వాటాను 49శాతానికి పెంచుకుంది.  వొడాఫోన్ ఐడియా షేర్లు గత ఐదు రోజుల్లో షేర్లు 12శాతం పడిపోయాయి. కానీ ఒక నెలలో 7శాతం, ఆరు నెలల్లో 44శాతం పెరిగాయి. 2025లో మొత్తం 33శాతం వృద్ధి సాధించాయి.

రిలీఫ్ ఇలా..

ప్రభుత్వం 5 సంవత్సరాల మారటోరియం ఇచ్చింది. వొడాఫోన్ ఐడియా  తమ రూ.87,695 కోట్ల ఏజీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు ఆర్థిక సంవత్సరం 2031–32, 2040–41 మధ్య ఆరు నుంచి పది ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో  చెల్లించాల్సి ఉంటుంది.  కానీ,  2017–18, 2018–19  బకాయిలు మాత్రం వచ్చే ఐదు సంవత్సరాల్లో చెల్లించాలి.