గోవర్ధన గిరిధారిగా నారసింహుడు..యాదగిరిగుట్టలో రెండో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు

గోవర్ధన గిరిధారిగా నారసింహుడు..యాదగిరిగుట్టలో రెండో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం వేణుగోపాలస్వామిగా, గోవర్ధనగిరిధారిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. సన్నాయి వాయిద్యాలు, మేళ తాళాల హోరులో వేదపారాయణాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ వేణుగోపాలస్వామి, గోవర్ధనగిరిధారి అలంకార సేవలను అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. 

ఉదయం ఆలయంలో మూలవరులకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం.. స్వామివారిని వేణుగోపాలస్వామి అలంకారంలో అందంగా ముస్తాబు చేసి ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు. వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించిన నారసింహుడు.. లక్ష్మీసమేతుడై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు.

అలాగే సాయంత్రం నిత్యారాధనలు ముగిసిన అనంతరం.. గోవర్ధనగిరిధారి అలంకారంలో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఆలయ తిరువీధుల్లో విహరింపజేశారు. ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు తరింపజేశారు. అనంతరం ప్రత్యేక వేదికపై స్వామివారిని అధిష్టింపజేసి గోవర్ధనగిరిధారి అవతార విశిష్టతను భక్తులకు అర్చకులు ప్రవచించారు.

నేడు రామావతారం, వేంకటేశ్వరస్వామి అలంకార సేవలు

అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం రామావతారం, సాయంత్రం వేంకటేశ్వరస్వామి అలంకార సేవలు చేపట్టనున్నారు.

 నూతన సంవత్సర వేడుకలకు ‘గుట్ట గుడి’  రెడీ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 'నూతన సంవత్సర' వేడుకలకు సర్వం సిద్దమైంది. గురువారం జనవరి ఒకటో తేదీన స్వామివారిని దర్శించుకోవడానికి  భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు రెడీ చేశారు. రకరకాల పూలు, మామిడాకులు, కొబ్బరి తోరణాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 

నేడు నాన్ స్టాప్ దర్శనాలు

గురువారంతో న్యూ ఇయర్ మొదలవుతున్న కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. రద్దీకి అనుగుణంగా నిరంతరాయంగా స్వామివారి దర్శనం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. యాదగిరిగుట్ట, పాతగుట్ట ఆలయాలను ఉదయం 3:30 గంటలకు తెరిచి.. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, అర్చనలు, అభిషేకం నిర్వహించనున్నారు.. ఇక భక్తులు ఎంతమంది వచ్చినా సరిపడేలా.. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు, పులిహోర ప్రసాదాన్ని స్పెషల్ గా తయారు చేసి సిద్ధంగా ఉంచారు. 

భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టనున్నారు. ఇక రద్దీకి అనుగుణంగా కొండపైన, కిందా తాగునీటి సౌకర్యం, భక్తులు కొండపైకి రాకపోకలు సాగించడానికి ఉచిత ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, భద్రత ఏర్పాటు చేశారు.