కోట్ల నిధులు.. ఖాళీ ట్యాంకులు.. జగిత్యాల జిల్లాలో స్లోగా అమృత్‌‌‌‌ 2.0 పనులు

కోట్ల నిధులు.. ఖాళీ ట్యాంకులు.. జగిత్యాల జిల్లాలో స్లోగా అమృత్‌‌‌‌ 2.0 పనులు
  •     2024లో ఐదు మున్సిపాలిటీలకు రూ.136కోట్లు రిలీజ్‌‌ 
  •     రెండేండ్లలో పూర్తికావాల్సి ఉండగా అంతంతమాత్రంగానే పనులు
  •     తాగునీటికి తప్పని అవస్థలు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని అమృత్‌‌ 2.0 పనులు స్లోగా సాగుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలకు అమృత్‌‌ 2.0 కింద 2024లో రూ.136 కోట్లు మంజూరైనా పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ పథకం కింద పనులు రెండేళ్ల లోపు పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటికీ నిర్మాణాలు అర్ధాంతరంగానే ఉన్నాయి. ట్యాంకులు లేవు, సంప్‌‌లు పూర్తి కాలేదు, హౌస్ కనెక్షన్లు మాటలకే పరిమితం అయ్యాయి.

నిలిచిన ట్యాంకులు 

అమృత్‌‌ 2.0 కింద జిల్లాలోని మున్సిపాలిటీల్లో జగిత్యాలకు రూ.38.06 కోట్లు, కోరుట్లకు రూ.41.05 కోట్లు, మెట్‌‌పల్లికి రూ.19.04 కోట్లు, ధర్మపురికి రూ.23 కోట్లు, రాయికల్‌‌కు రూ.15.02 కోట్లు మంజూరయ్యాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ నీటి ట్యాంకర్లు తిరుగుతున్నాయి. మరో వైపు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శాశ్వత తాగునీటి నిర్మాణాలు మాత్రం కదలడం లేదు. జగిత్యాలలో ధర్మ సముద్రం వద్ద సంప్ పనులు కొంతవరకు పూర్తయినా, వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇంకా మొదటి దశలోనే ఉంది. 

ఎస్‌‌కేఎన్‌‌ఆర్ కాలేజీ, కొత్త బస్టాండ్ వంటి కీలక ప్రాంతాల్లో పనులు పేరుకే కొనసాగుతున్నాయి. కోరుట్లలో ట్యాంక్ నిర్మాణం దాదాపు పూర్తయినా, ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది. మెట్‌‌పల్లిలో పనులు నత్తనడకన సాగుతుండగా, రాయికల్‌‌లో భూ సమస్యతో అసలు పనులే మొదలు కాలేదు.

ప్లానింగ్ లోపమా.. పర్యవేక్షణ వైఫల్యమా..?

అమృత్ 2.0 వంటి కీలక పథకంలో ప్లానింగ్ లోపాలు, సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూ సమస్యలు ముందే గుర్తించకపోవడం, కాంట్రాక్టర్ల పని తీరును పర్యవేక్షించకపోవడం వల్లే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పబ్లిక్ హెల్త్ అధికారులు నోటీసులు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదని పట్టణ వాసులు అంటున్నారు.

పనులు పురోగతిలో ఉన్నాయి..

అమృత్ స్కీమ్ కింద జగిత్యాల జిల్లా కు రూ. 136 కోట్లు విడుదల అయ్యాయి. ఈ పనులు రెండేండ్లలో పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 35 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. అనుకున్న టైంలో పూర్తి చేస్తాం.
– వరుణ్, పబ్లిక్ హెల్త్ ఇన్‌‌చార్జి డీఈ, జగిత్యాల జిల్లా