మేం పోరాడితేనే.. బనకచర్ల ఆగింది : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

మేం పోరాడితేనే.. బనకచర్ల ఆగింది : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  •     ఏపీ ప్రాజెక్టు కడుతున్నదని తెలిసిన వెంటనే కేంద్రానికి లేఖ రాసినం: మంత్రి ఉత్తమ్ 
  •     అనుమతులు ఇవ్వొద్దని వరుసగా లెటర్లు పంపినం 
  •     దాని ఫలితంగానే ఏపీ ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపింది 
  •     డీపీఆర్‌‌‌‌కు ఏపీ టెండర్లు పిలిస్తే.. వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశాం 
  •     రాష్ట్ర నీటి హక్కులపై రాజీపడేది లేదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టును పోలవ రం–నల్లమలసాగర్‌‌‌‌గా విస్తరించి గోదావరి నీళ్లను తన్నుకుపోయేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని రకాల చర్యలను తీసుకున్నామని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర నీటి ప్రయోజనాలపై రాజీపడబోమని స్పష్టం చేశారు. తాము చేసిన పోరాటంతోనే ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపిందని గుర్తు చేశారు. ‘‘పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును ఏపీ చేపడుతున్నదని తెలిసిన వెంటనే 2025 జనవరిలో కేంద్రానికి లేఖ రాశాం. 

ప్రాజెక్టును నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నందున అనుమతులను తిరస్కరించాలని కోరుతూ జూన్​13, 16న కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలశక్తి శాఖ, అటవీ శాఖలకు లేఖలు రాశాం. మేం చేసిన ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్​పర్ట్​అప్రైజల్​కమిటీ (ఈఏసీ).. ఏపీ ప్రతిపాదనలను  జూన్​30న తిప్పి పంపింది. ప్రాజెక్ట్​విషయంలో అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నాయని, గోదావరి ట్రిబ్యునల్​అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్నారని, సీడబ్ల్యూసీ క్లియరెన్స్​రానంత వరకు అప్రైజ్ చేయలేమని కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టం చేసింది” అని వెల్లడించారు. 

ఈ మేరకు బుధవారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై ఉత్తమ్ ప్రకటన విడుదల చేశారు. 1980లో గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ట్రిబ్యునల్​అవార్డుకు విరుద్ధంగా ఏపీ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నదని అందులో పేర్కొన్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టుకే సెంట్రల్​వాటర్​కమిషన్​టీఏసీ క్లియరెన్సులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం గోదావరి నుంచి కృష్ణాకు 80 టీఎంసీలే తరలించాల్సి ఉన్నా.. అంతకుమించి కేటాయింపులే లేని వరద జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. అయితే ఏపీ బనకచర్ల ప్రాజెక్టును కట్టినా, పేరు మార్చి నల్లమలసాగర్​లింక్‌‌గా చేపట్టినా ఆపి తీరుతామని తేల్చి చెప్పారు. 

సుప్రీంలో కేసు కూడా వేసినం..

ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రంతో పాటు గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కీ ఫిర్యాదు చేశామని మంత్రి ఉత్తమ్​తెలిపారు. ప్రాజెక్ట్​ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​)పై ఆ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని చెప్పారు. ‘‘నిరుడు జులైలో కేంద్రం నిర్వహించిన హైలెవెల్​మీటింగ్​లో కృష్ణా, గోదావరి బేసిన్లలోని జల వివాదాలను తేల్చాలని డిమాండ్​చేశాం. 

పోలవరం బనకచర్లపై చర్చించేది లేదని, అజెండాలో పెట్టవద్దని తేల్చి చెప్పాం. ఆ తర్వాత పేరు మార్చి పోలవరం నల్లమలసాగర్​ ప్రాజెక్టు పేరిట నవంబర్​ 21న డీపీఆర్​తయారీకి ఏపీ టెండర్లు పిలిస్తే.. డిసెంబర్ 16న సుప్రీంకోర్టులో పిటిషన్​వేశాం. పోలవరం నల్లమలసాగర్​ప్రాజెక్టు పనులను నిలిపేసేలా ఏపీతో పాటు కేంద్ర సంస్థలకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్​దాఖలు చేశాం. 

టెండర్​ ప్రక్రియను నిలిపేయాలని కోరాం. న్యాయపరంగా ముందుకు వెళ్లడం ద్వారా రాష్ట్రానికున్న 968 టీఎంసీల జలహక్కులను కాపాడేందుకు మేం ఎంత కమిట్​మెంట్​తో పనిచేస్తున్నామో స్పష్టం చేశాం. నీళ్ల హక్కులను కాపాడడంలో మేం ఫెయిల్​ అయ్యామన్న హరీశ్​రావు ఆరోపణలు అబద్ధం. మేం వేగంగా స్పందించి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఈఏసీ.. ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కు పంపింది. వరద జలాలకు కేటాయింపులే లేవు. కాబట్టి ఇందులో అన్ని సభ్య రాష్ట్రాల అభిప్రాయాలనూ తీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు.