- తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం
- కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలమివ్వాలి
- అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తం
- ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే..
- మనం కడుపు మాడ్చుకొని పోరాడితే వచ్చిందని కామెంట్
- కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ
కరీంనగర్/ హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వంలో ఉద్యమకారులను ఉరికించి కొడతామని కొందరు బెదిరించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమ పార్టీ (బీఆర్‌ఎస్)లోకి వచ్చి ఉద్యమకారులపైనే పెత్తనం చెలాయిస్తూ కేసులు పెట్టారని, సెక్రటేరియెట్‌కు వెళ్తే ‘ఇక్కడ మీకేం పని’ అంటూ అవమానించారని చెప్పారు.
ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలేదని, ఉద్యమకారులు కడుపు మాడ్చుకొని పోరాడితే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామనే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కవిత ఆక్రమించారు.
ఉద్యమకారులతో కలిసి వంటావార్పు చేసి, గుడిసెలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులకు గౌరవం దక్కలేదని, మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఎంతో చేస్తామని మనం చెప్పామని, కానీ తెలంగాణ కోసం 12 వందల మంది అమరులైతే కేవలం 540 మందికి మాత్రమే పరిహారం అందిందని చెప్పారు. ఇప్పుడు ఉద్యమకారులంతా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరకు వచ్చారని, ఇక మన ఐక్యతను ప్రదర్శిద్దామని, ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని కవిత పిలుపునిచ్చారు.
ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాడుతం
ఉద్యమకారుల ఫోరం ఇచ్చిన డేటా ప్రకారమే ఉద్యమకారులను గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు. ‘మనం బతుకమ్మ పేర్చినం, బోనం ఎత్తినం, వంటా వార్పు అంటూ ఉద్యమాలు చేసినం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు నష్టం జరిగితే ఓపిక పట్టినం. కానీ.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ద్వారా లబ్ధి పొందేందుకు వారికి ఎన్నో హామీలు ఇచ్చింది.
పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల జాగా ఇస్తామని మాట ఇచ్చింది. కానీ కనీసం ఉద్యమకారులను గౌరవించి వారికి శాలువా కప్పి సన్మానం కూడా చేయలేదు. తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో పాటు మా వాటా ఇవ్వమని మాత్రమే మనం కోరుతున్నాం. 12 ఏండ్లలో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారు. హాస్పిటల్‌లో చేరితే వారికి సాయం కూడా చేయలేదు.
నిజంగా ఉద్యమకారుల కుటుంబాలు ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు హామీలకు సంబంధించి ఒక్క ప్రకటన లేదని అన్నారు. ఏ జిల్లాకు, ఏ ఊరిలోకి వెళ్లినా సరే అక్కడి ప్రజలు ఉద్యమకారులెవరో చెబుతారని, వాళ్లు చెప్పిన వారికే ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కవిత కారుపై 16 చలాన్లు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కారుపై 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో 15 చలాన్లు ఓవర్ స్పీడ్వే కావడం గమనార్హం. ఇర్రెగ్యులర్నంబర్ప్లేట్పై ఒక చలాన్ ఉంది. 2024, డిసెంబర్ 29 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు ఈ చలాన్లు పడగా.. రూ.15,760 ఫైన్లు పెండింగ్ఉన్నాయి.
ఓవర్స్పీడ్లో అత్యధికంగా ఆమె కారు గరిష్ఠంగా గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వెళ్లారు. 16 చలాన్లలో మూడు నిజామాబాద్ ట్రాఫిక్ పీఎస్లిమిట్స్లో పడగా.. మూడు చలాన్లు సిద్దిపేట, రెండు చలాన్లు దేవనపల్లి, ఒకటి చొప్పున చలాన్లు శంషాబాద్, మేడ్చల్, చేగుంట, కరీంనగర్, చేవెళ్ల, రామగుండం, తిరుమలగిరి ట్రాఫిక్పీఎస్లిమిట్లలో పడ్డాయి.
