ఆస్తుల కోసమే కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట..పదేండ్లు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన్రు

ఆస్తుల కోసమే కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట..పదేండ్లు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన్రు
  • ఐటీఐలను గత ప్రభుత్వం నాశనం చేసింది: మంత్రి వివేక్​వెంకటస్వామి
  •  ప్రజాపాలనలో లక్ష ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
  •  యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో ఏటీసీకి శంకుస్థాపన

యాదాద్రి, వెలుగు: కేసీఆర్​ఫ్యామిలీలో కొడుకు, బిడ్డ, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని.. రాష్ట్రం సాధించుకున్నాక పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని మండిపడ్డారు. 

యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో రూ.47 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్​(ఏటీసీ)కు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్ల స్కిల్స్​ పెంచడానికి 115 ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నామని, 540 మంది ట్రైనర్లను నియమిస్తామని చెప్పారు. ఏటీసీలో చదివే స్టూడెంట్లకు నెలకు రూ.2 వేల స్టైపెండ్​ ఇస్తామన్నారు. 

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఐటీఐలను నాశనం చేసిందని మండిపడ్డారు. ఒక్కరికి కూడా రేషన్​కార్డు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లూ కట్టించలేదని వివేక్​ విమర్శించారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో పేదలకు భూములు ఇచ్చారని.. ఇన్నాళ్లకు తమ ప్రభుత్వం పేదలకు 17 లక్షల ఇండ్లు కట్టించాలని నిర్ణయించిందని తెలిపారు. పేదలకు రూ.13 వేల కోట్లతో సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. 

అప్పులున్నా హామీలు  అమలు చేస్తున్నం

రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల పాలు చేసినా.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని మంత్రి వివేక్​వెంకటస్వామి తెలిపారు. ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో 50 వేల టీచర్​ పోస్టులు ఉన్నాయన్నారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్​ ఇస్తామని చెప్పారు. సీఎం రేవంత్​ రెడ్డి దావోస్​కు వెళ్లి ఎన్నో పెట్టుబడులు తెచ్చారని, తెలంగాణ రైజింగ్ ఎజెండాతో కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. 

తమ హయాంలో రాష్ట్రానికి రూ.5.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తుంగతుర్తితో లీడ్​ క్యాప్​ సెంటర్​ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని, పంచాయతీ ఎన్నికల తరహాలోనే జడ్పీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. 

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.3,622 కోట్లు సాధించి బెస్ట్ పర్ఫామెన్స్ చూపారని ప్రశంసించారు. తుంగతుర్తికి మరో ఐటీఐ కాలేజ్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే మందల సామెల్ కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, కలెక్టర్​ హనుమంతరావు, అడిషనల్​ కలెక్టర్​ భాస్కరరావు పాల్గొన్నారు.