అహంకారం సహించేది లేదు.. విపక్షాలకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

అహంకారం సహించేది లేదు.. విపక్షాలకు మంత్రి పొంగులేటి హెచ్చరిక
  •     గెలిచిన వారే కాదు.. ఓడిన వారూ నా దృష్టిలో సర్పంచులే
  •     పాలేరు నియోజకవర్గ సర్పంచులకు మంత్రి పొంగులేటి ఆత్మీయ సత్కరం
  •     పలు మండలాల్లో పర్యటన.. అభివృద్ధి పనులు ప్రారంభం... 

ఖమ్మం రూరల్/కల్లూరు​, వెలుగు : అధికారం పోయినా అహంకారం తగ్గని కొందరు నాయకులకు కాలమే బుద్ధి చెబుతుందని, తమది కక్షపూరిత ప్రభుత్వం కాదని, విర్రవీగితే సహించేది లేదని రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. బుధవారం ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్‌ లో పాలేరు నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ‘ఆత్మీయ సన్మాన సభ’ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులతో పాటు మిత్రపక్షాల నుంచి ఎన్నికైన వారికి మంత్రి పట్టువస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన ప్రజా చైతన్యం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు. ఈ విజయం అహంకారానికి తావు ఇవ్వకూడదని, బాధ్యతను గుర్తు చేయాలని,  గెలిచిన సర్పంచులు ప్రజల కష్టాల్లో తోడుండాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచిన వారే కాదు, స్వల్ప తేడాతో ఓడిన వారు కూడా తన దృష్టిలో సర్పంచులేనని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. నియోజకవర్గంలోని 134 పంచాయతీల్లో సుమారు 70 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు జయకేతనం ఎగురవేయడం శుభపరిణామన్నారు. 

రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రఘురాం రెడ్డి  మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచాలి

విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెంచాలని మంత్రి పొంగులేటి అన్నారు. బుధవారం కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్​ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో గతంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు తగ్గడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంపై ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు, పాఠశాల అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని మండల విద్యాశాఖాధికారి ఆదేశించారు. అనంతరం కల్లూరు మండలం నారాయణపురం, పేరువంచ, కొర్లగూడెం, రామకృష్ణపురం  పరిధిలో  బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. 

ఆ తర్వాత  కల్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో నిర్మించిన వన సంరక్షణ సమితి సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. వన సంరక్షణ సమితిని ప్రోత్సహిస్తే, అడవికి మంచి జరుగుతుందని మంత్రి అన్నారు. కనకగిరి, పులిగుండాల తదితర అటవీ ప్రాంతాల్లో 4 నుండి 5 వన సంరక్షణ సమితులు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యేరాగమయి మాట్లాడుతూ అడవులు, చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతో అవసరమన్నారు. చెట్ల పెంపకం, వన సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, ఎఫ్ డీఓ మంజుల, కల్లూరు ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీరజ ప్రభాకర్, మండల  నాయకులు పాల్గొన్నారు.