- ప్రకాశం బజార్‌లో ఫుట్‌ఫాత్ ఆక్రమణలను దగ్గరుండి తొలగింపజేసిన మంత్రి
- పాత కలెక్టరేట్ స్థలంలోకి పండ్ల, కూరగాయల మార్కెట్
- ట్రాఫిక్ రద్దీ తగ్గించిప్రమాదాలను అరికట్టేలా ప్లాన్
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ను సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రకటించిన విధంగానే మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకే నల్గొండ పట్టణంలో పర్యటించారు. లతీఫ్ సాబ్ దర్గాతో పాటు ప్రకాశం బజార్ లో ఆయన పర్యటించి ప్రకాశం బజార్ లో ఫుట్ పాత్ ఆక్రమణలను క్లియర్ చేయించారు. అక్కడ ఉన్న పండ్ల మార్కెట్, కూరగాయల మార్కెట్లను పాత కలెక్టరేట్ స్థలంలోకి మార్పించారు.
డీసీఎం పార్కింగ్ సెంటర్ ను దేవరకొండ రోడ్డులోని హౌసింగ్ బోర్డ్ కు తరలించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్గొండకు గుండెకాయ ప్రకాశం బజార్ అన్నారు. ప్రకాశం బజార్ లో రోజు 10,000 మంది వ్యాపారం నిమిత్తం ప్రజలు వస్తుంటారన్నారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు, షాపులు ఉండేవి ఎలాంటి ఇబ్బంది అయ్యేది కాదనీ, వ్యాపారాలు పెరగడం, జనాభా పెరగడం వల్ల ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తో యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు. అందువల్లనే రోడ్డుపై ఫూట్ పాత్ పై ఉన్న పూలు, పండ్లు, దుకాణాలు, ఇతర చిన్న చిన్న షాపులను పాత కలెక్టరేట్ స్థలంలోకి తరలిస్తున్నామన్నారు. పూలు, పండ్ల వ్యాపారులు ఎవరికి అన్యాయం జరగనీయమని హామీ ఇచ్చారు. పాత కలెక్టరేట్ స్థలంలో ఉన్న డీసీఎంలను దేవరకొండ రోడ్ లో ఉన్న హౌసింగ్ బోర్డ్ స్థలంలోకి తక్షణమే తరలించాలని అధికారులను ఆదేశించారు.
వీధి వ్యాపారులందరికీ స్థలం కేటాయిస్తాం
వీధి వ్యాపారులందరికి స్థలం కేటాయిస్తామని, 50, 70, 100 గజాల వారీగా స్థలాల కేటాయింపు ఉంటుందన్నారు. వారి వారి షాపుల పరిణామాన్ని బట్టి స్థలం కేటాయింపు చేస్తామని చెప్పారు. ప్రజలకు మేలు కలిగిందుకే ఈ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రకాశం బజార్ లోని డివైడర్లను జేసీబీల సహాయంతో అప్పటికప్పుడే తొలగించే చర్యలను చేపట్టారు. సాయంత్రంలోగా డివైడర్ తొలగింపును పూర్తి చేయాలని, పాత కలెక్టరేట్ స్థలంలో సీసీ వేయించి మార్కింగ్, లైనింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
ప్రకాశం బజార్‌లో భూగర్భ ఎలక్ట్రిసిటీ తో పాటు, సీసీ రోడ్డు కొత్తగా వేయిస్తామని, ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉంటుంద న్నారు. మంత్రి వెంట ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ కొలను శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు, మున్సిపల్, విద్యుత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారుల రాస్తారోకో
ముందస్తు సమాచారం లేకుండా మంత్రి ఆధ్వర్యంలో అర్ధరాత్రి చిరు వ్యాపారుల పండ్లు, కూరగాయలు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రకాశం బజార్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో తెచ్చుకున్న పండ్లు ధ్వంసం చేసి వారి జీవనోపాధిని కోల్పోయే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఉపాధి పెంచే విధంగా అభివృద్ధి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
రాస్తారోకో చేస్తున్న సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ లను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారు ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎండీ సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్, దండెంపల్లి సత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు జమాల్ ఖాద్రి, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, రహీం పాల్గొన్నారు.
