
- ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు : ఫారెన్ డ్రగ్ హైబ్రీడ్ కన్నాబిస్ ను అమ్ముతున్న ముగ్గురిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపిన ప్రకారం.. హైబ్రీడ్ కన్నాబిస్ (కుష్) డ్రగ్ ను అమ్ముతున్నట్లు శుక్రవారం సమాచారం అందింది. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు సిబ్బందితో వెళ్లి.. లాలాపేట బ్రిడ్జి వద్ద హైబ్రీడ్ కన్నాబిస్ అమ్ముతున్న అమన్, మహమ్మద్ ముబీన్ ను అదుపులోకి తీసుకుని..23 గ్రాముల డ్రగ్ ను స్వాధీనం చేసుకుని విచారించారు.
మల్కాజిగిరికి చెందిన నిఖిల్ నాయక్ ఇచ్చాడని వారు చెప్పగా అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని.. 10 గ్రాముల కన్నాబిస్ ను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ముబీన్ బెంగళూరు వెళ్లి కొనుగోలు చేసి సిటీకి తెస్తుండగా.. ముగ్గురూ కలిసి అమ్ముతున్నారు. యువకులకు గ్రాముకు రూ,3500 చొప్పున విక్రయిస్తున్నట్టు నిందితులు చెప్పారు.
విదేశాల నుంచి సముద్రమార్గాన బెంగళూరు, కొరెనూర్ కు అక్రమంగా సప్లయ్ అవుతున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీన్ని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో, ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువ పండిస్తారని, గంజాయిలా ఉంటుందని, మత్తు అధిక మోతాదులో ఉంటుందిన, దీనిని ఓజి, కుష్ పేర్లతో కూడా పిలుస్తారని పేర్కొన్నారు.