అదంతా అబద్ధం.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ఫేక్ ప్రచారం: విక్రమ్ మిస్రీ

అదంతా అబద్ధం.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ఫేక్ ప్రచారం: విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ: గురువారం (మే 8) రాత్రి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని.. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు ప్రయత్నించిందని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‎కు కౌంటర్‎గా గురువారం (మే  8) రాత్రి పాక్ భారత్‎పై దాడులకు పాల్పడటం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం (మే 9) మీడియాకు వెల్లడించింది. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా, విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాకు బ్రీఫింగ్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థంగా కూల్చేశామని.. కూలిన డ్రోన్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో టర్కీకి చెందినవిగా గుర్తించామని తెలిపారు. కాల్పుల విరణమ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతుందని.. గురువారం రాత్రి మొత్తం 36 చోట్ల దాడులకు పాక్ యత్నించిందని వెల్లడించారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు. పాక్ దాడులకు కౌంటర్‎గా భారత్ చేసిన ఎదురుదాడిలో భాపాక్ సైన్యానికి భారీ నష్టం జరిగిందని పేర్కొన్నారు. 


దాడులపై పాక్‌ తీవ్రంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. భారత్‎లోని ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని అబద్ధం చెప్పి ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని అన్నారు. దాడులకు మతం రంగు పూసి.. భారత్‎లో సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ కుటిలయత్నాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. పూంఛ్‌లోని ఓ స్కూల్‌పై పాక్‌ దాడి చేసిందని.. ఈ ఎటాక్‎లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారని తెలిపారు. దాడి భారత్‎లోని గురుద్వారాలు, ఆలయాలు, స్కూళ్లు లక్ష్యంగా పాకిస్తాన్‌ దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

 పాక్‎తో ఉద్రిక్తతల నేపథ్యంలో కర్తార్ పూర్ కారిడార్‎ను మూసేశామని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందం ప్రస్తుతానికి రద్దు అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తోన్న పాక్‏కు నిధులు ఇవ్వొద్దని ఐఎంఎఫ్ మీటింగ్‎లో డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐఎంఎఫ్‎లోని మిగిలిన సభ్య దేశాలతో చర్చిస్తున్నామని చెప్పారు. పాక్ దాడులు, భారత ప్రతిదాడులపై భారత విదేశాంగ మంత్రి అమెరికా ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తోన్న  పోరులో అమెరికా మనతో కలిసి పని చేస్తోందన్నారు.