లక్నవరం, తాడ్వాయి, బొగతల్లో ఎకోటూరిజంను ప్రారంభించిన అటవీ శాఖ

లక్నవరం, తాడ్వాయి, బొగతల్లో ఎకోటూరిజంను ప్రారంభించిన అటవీ శాఖ
  • లక్నవరం, తాడ్వాయి, బొగతల్లో ప్రారంభించిన అటవీ శాఖ
  • తొలి దశలో తాడ్వాయి హట్స్ నుంచి సైక్లింగ్, ట్రెక్కింగ్ 
  • కరోనాతో రెండేండ్ల పాటు నిలిచిపోయిన పర్యాటకం

హైదరాబాద్, వెలుగు: కరోనా వల్ల ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్య పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగతల్లో రెండేండ్లు నిలిచిపోయిన ఎకో టూరిజాన్ని అటవీ శాఖ మళ్లీ ప్రారంభించింది. తొలి దశలో భాగంగా తాడ్వాయి హట్స్, లక్నవరం, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ దగ్గర సైక్లింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టామని ములుగు జిల్లా అటవీ అధికారి కిష్టా గౌడ్ సోమవారం వెల్లడించారు. లక్నవరం ఫెస్టివల్ పేరుతో గతంలో తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేది. అయితే, కరోనా మహమ్మారి వల్ల ఆ కార్యక్రమాలు రెండేండ్ల పాటు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు వాటిని అటవీ శాఖ ప్రారంభించింది. 

త్వరలో 24 గంటల ప్యాకేజీ

ప్రస్తుతం తాడ్వాయి హట్స్ నుంచి 2–3 కిలోమీటర్ల దూరంలోని అటవీ అందాలను చూసేందుకు ట్రెక్కింగ్, సైక్లింగ్  ప్రారంభించామని అటవీ శాఖ తెలిపింది. గంటకు రూ.100 చెల్లించి సైక్లింగ్ చేయొచ్చని ప్రకటించింది. సైక్లింగ్ దారిలో లక్నవరం అలుగు, తూములను చూడడంతో పాటు వాచ్ టవర్ నుంచి బర్డ్ వాచింగ్ యాక్టివిటీ కూడా చేయొచ్చని వెల్లడించింది. తాడ్వాయి దగ్గర్లోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ (రివర్ ఐలాండ్), డోల్మెన్ సమాధులను (పురాతన రాకాసి గుహలు)  కూడా సందర్శించవచ్చని వివరించింది. లక్నవరం సమీపంలో ఒక రాత్రి మొత్తం టెంట్లో బసచేసేలా 24 గంటల ప్యాకేజీని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అంతేగాకుండా తాడ్వాయి హట్స్ నుంచి ఐలాపూర్ వరకు 20 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో సఫారీ ట్రిప్ కూ  వెళ్లవచ్చని పేర్కొంది.

టూరిజం పాలసీ కూడా

అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్ ఫ్రీజోన్లుగా ప్రకటించామని, పర్యాటకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం 80748 27875 (లక్నవరం), 73826 19363 (తాడ్వాయి) నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా, తెలంగాణలో అనేక అటవీ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, టూరిస్టులకు తగినట్టు ఎకోటూరిజం పాలసీ రూపొందిస్తున్నామని పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఓఎఫ్ (అటవీ సంరక్షణ ప్రధాన అధికారి) ఆర్ఎం డోబ్రియాల్ వెల్లడించారు. ప్రభుత్వ అనుమతితో త్వరలోనే ఆ పాలసీ వివరాలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.