హైదరాబాద్, వెలుగు: మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, సమయపాలన పాటిస్తూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అటవీశాఖ అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న కాంపా పనులు, సామాజిక అటవీ ప్రాజెక్టులు, వనమహోత్సవం, అటవీ సంరక్షణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ.. వనమహోత్సవ కార్యక్రమాలను స్పీడప్ చేయాలని సూచించారు.
వానలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని మొక్కలు నాటాలని, కేవలం రికార్డుల కోసమే కాకుండా అవి బతికేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అటవీ సంరక్షణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అనుమతుల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీ ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, సీసీఎఫ్‌లు శరవణన్, ఆశా, ప్రియాంక వర్గీస్, క్షితిజతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
