ఫేక్ పాస్ బుక్ లు సృష్టించి అమ్ముతున్న అక్రమార్కులు

ఫేక్ పాస్ బుక్ లు సృష్టించి అమ్ముతున్న అక్రమార్కులు


    ధరణిలో కనిపించని పట్టాదారు ఖాతా, సర్వే నంబర్లు
    సూర్యాపేట జిల్లాలో భూ బాగోతం
    ఎంపీటీసీ ఫిర్యాదుతో ఆఫీసర్ల ఎంక్వైరీ

సూర్యాపేట, వెలుగు: దొంగ పాస్​బుక్​లతో అక్రమార్కులు దర్జాగా ఫారెస్ట్​ భూమిని అమ్మకానికి పెట్టారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లు ఉపయోగించి బై నంబర్లతో 500 ఎకరాలకు ఫేక్​ పాస్​బుక్​లు సృష్టించారు. ఒరిజినల్ పాస్ బుక్​లకు తీసిపోకుండా ఉన్న వీటిని చూసి ఆఫీసర్లు సైతం అవాక్కయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ డివిజన్‌ చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామ సర్వే నంబర్‌318లో సుమారు 1,393 ఎకరాల ఫారెస్ట్‌ భూమి ఉంది. ఈ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అటవీశాఖ ఆధీనంలో ఈ భూమి ఉండగా.. ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్‌318/ఆ1లో  1,389.36 ఎకరాలు గల్లా శ్రీనివాసరావు పేరుతో నమోదైంది. ఫారెస్ట్‌, రెవెన్యూ డిపార్ట్​మెంట్లు బౌండరీ వివాదంతో కోర్టుకెక్కడంతో  ఆఫీసర్లు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంచారు.  

30 మంది పేర్లతో..

ధరణితో దొంగ పాస్‌ బుక్​లు పుట్టుకొచ్చే అవకాశమే లేదని, పాస్‌పోర్టు కంటే హై సెక్యూరిటీ ఫీచర్స్​తో పాస్​బుక్​లను తయారు చేశామని సర్కారు చెబుతోంది. కానీ ఓవైపు సర్వే నంబర్‌ 318 భూముల వివాదం కోర్టులో ఉండగానే 30 మంది పేర్లతో 500 ఎకరాలకు బై నంబర్లతో ఫేక్ పాస్​బుక్​లు సృష్టించారు. ఆ 30 మంది వివరాలు ధరణి పోర్టల్‌లో లేవు. గ్రామస్తులకు సైతం వారి పేరుతో పాస్​బుక్​లు ఉన్నట్లు తెలియదు. పట్టాదారు పాసుబుక్​పై వ్యక్తుల వివరాలు, ఫొటోతోపాటు ఆధార్‌ నంబర్‌ కూడా ఉంది. గత ఏడాది 2 ఫిబ్రవరి, జులై 2న పాస్​బుక్​లు జారీ అయినట్లు ఉండగా వాటిపై స్థానిక తహసీల్దార్‌ సంతకం కూడా ఉంది. ఇదిలా ఉంటే  ధరణిలో నమోదైన వివరాల ఆధారంగా ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను ప్రింట్‌ చేసి అందిస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో వివరాలు లేకుండానే పాసుబుక్​లు ఎలా వచ్చాయో అంతుచిక్కడం లేదు.  ఫేక్​ పాస్​బుక్​లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ భూములను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ తంతంగం వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎంపీటీసీ ఫిర్యాదుతో కదలిన డొంక

పాస్​బుక్​ఫొటో, వివరాలను వాట్సప్​లో పెట్టి భూముల అమ్మకానికి ప్రయత్నించారు. చింతలపాలెం మండలం తమ్మారం ఎంపీటీసీ సైదమ్మ,  ఆమె భర్త మోహన్‌రెడ్డి పేరుతో 15 ఎకరాల చొప్పున 30 ఎకరాలకు ఫేక్​ పాస్​బుక్​లు పుట్టించారు. ఆ పాస్​బుక్​లు ఎంపీటీసీ దృష్టికి వచ్చాయి. వారికి ఆ సర్వే నంబర్​లో ఎలాంటి భూమి లేకపోవడం, మిగతా వివరాలన్నీ సరిగ్గా ఉండడంతో తమ పేరుతో దొంగ పాస్​బుక్​లు సృష్టించినట్లు గుర్తించారు. దీంతో స్థానిక తహసీల్దార్​కు సమాచారం ఇవ్వగా విషయం బయటపడింది. పలువురికి వాట్సప్​లో వచ్చిన పాస్​బుక్​వివరాలను ధరణిలో చెక్​చేయగా కనిపించలేదు.  దీంతో అవన్నీ నకిలీవిగా గుర్తించారు. 

ఎంక్వైరీ చేస్తున్నం

318 సర్వే నంబర్ లో ఉన్న భూములు వివాదంలో ఉండడంతో ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాం. 318లో ఎవరికీ  పట్టా పాస్ బుక్​లు జారీ చేయలేదు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నం.  
– మోహన్‌రావు, అడిషనల్ కలెక్టర్‌, సూర్యాపేట