మాట్రిమోనిలో పరిచయమై.. రూ. 20 లక్షలు లాగేసింది!

 మాట్రిమోనిలో పరిచయమై.. రూ. 20 లక్షలు లాగేసింది!
  • యువకుడిని నమ్మించి మోసగించిన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు

వర్ధన్నపేట, వెలుగు: మాట్రిమోనిలో పరిచయమైన మహిళ నమ్మించి యువకుడి వద్ద రూ. లక్షల్లో వసూలు చేసి మోసగించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ కు చెందిన యువకుడికి కొంతకాలం కింద మాట్రిమోని వెబ్ సైట్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. ఆపై పెండ్లి చేసుకుందామనేదాకా చనువు పెరిగింది. అతడు నిజమని నమ్మి ఆమె చెప్పినట్టల్లా చేశాడు. పెండ్లి చేసుకుందామని, సొంతిల్లు కట్టుకుని కాపురం పెడదామని ఇలా.. రూ. 20 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె పెండ్లి ప్రస్తావన పక్కకు పెట్టడంతో పాటు యువకుడి ఫోన్లు కూడా ఎత్తడం లేదు. 

దీంతో అతడు ఆరా తీస్తే అసలు బాగోతం బయటపడింది. భూపాలపల్లికి చెందిన మహిళగా గుర్తించాడు.  ఆమెకు పెండ్లి అయి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు యువకుడు తెలుసుకున్నాడు. మోసపోయానని తన డబ్బులు ఇప్పించాలంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భర్త వదలిపెట్టడంతో సదరు మహిళ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది.