ఓయూ, వెలుగు: యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ టీచర్లు, నాన్- టీచింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఓయూ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు చేపట్టిన నిరసనలో జేఏసీ నాయకులు డాక్టర్ పరుశురాం, డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 10న ఓయూ పర్యటనలో సీఎం రూ.వెయ్యి కోట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఈ విషయంపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు చర్చ చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. జేఏసీ సభ్యులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ సోమేశ్వర్, డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి, ఎస్ఎల్ పద్మ, ప్రదీప్, రవికుమార్, కృష్ణయ్య, మోహన్, అశోక్, విష్ణు, భూపతి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
