పోడు రైతులపై జులుం

V6 Velugu Posted on Sep 21, 2021

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధవరంలో
  • పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం
  • పట్టాలివ్వకపోగా భూములు స్వాధీనం
  • కేసులు పెట్టి సతాయిస్తున్న సర్కారు
  • బాలింతలను, గర్భిణులను, వృద్ధులనూ వదుల్తలే
  • హరితహారం పేరిట భూముల స్వాధీనానికి 
  • ప్రభుత్వం ప్రయత్నాలు మొక్కలు నాటేందుకు 
  • వస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు తమకు బతుకు 
  • దెరువు ఎట్లా అని కాళ్లా వేళ్లా పడుతున్న అడవి బిడ్డలు

నెట్​వర్క్​, వెలుగు: పొట్టకూటి కోసం తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని అడుగుతున్న అడవి బిడ్డలకు రాష్ట్ర సర్కారు పట్టాలియ్యకపోగా, ఉల్టా కేసులు పెట్టి సతాయిస్తున్నది. గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, వృద్ధులు అని కూడా చూడకుండా కటకటాల పాల్జేస్తున్నది.  2018 ఎన్నికల్లో గెలిచాక సీఎం కేసీఆర్..  స్వయంగా తానే వచ్చి డివిజన్ల వారీగా మీటింగులు పెట్టి పోడు రైతులకు పట్టాలిప్పిస్తానని మూడుసార్లు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకొని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తానన్నారు. కానీ.. అవే భూముల్లో అంగుళం కూడా వదలకుండా హరితహారంలో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఫారెస్టోళ్లకు తెరవెనుక ఆదేశాలిస్తున్నది.  దీంతో ఏటా వానాకాలంలో పంటలు వేసేందుకు గిరిజనులు, మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు భూముల్లోకి వస్తుండడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. తమ భూముల జోలికి రావద్దని ఫారెస్టోళ్లను పోడు రైతులు కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నారు. 


అయినా వినడం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన రైతులపై హత్యాయత్నం కింద నాన్​బెయిలబుల్​కేసులుపెట్టి పోలీస్​స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో వందలాది పోడు రైతులు అటు భూములు పోయి, ఇటు కేసులపాలై దయనీయంగా బతుకుతున్నారు. 
సర్కారు ఆటలో బలవుతున్న పోడు రైతులు
ఓవైపు అర్హత ఉన్న పోడు రైతులందరికీ పట్టాలిస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు అవే పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ఫారెస్ట్​ ఆఫీసర్లకు టార్గెట్లు​పెడుతోంది. దీంతో పోడు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఫారెస్ట్​ ఆఫీసర్లు, ప్రాణాలు పోయినా సరే తిండి పెట్టే భూములను  కాపాడుకోవాలని అడవి బిడ్డలు చేస్తున్న పోరాటాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. సర్కారు ఆడుతున్న ఈ డబుల్​గేమ్​లో పోడురైతులే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటు తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న పోడు భూములను కోల్పోవడంతో పాటు కేసులపాలై నెలల తరబడి పోలీస్​స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో గతేడాది పోడు భూముల ఇష్యూలో 63 మంది గిరిజనులపై కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏకంగా 36 మంది పోడు రైతులు కేసులపాలయ్యారు. 2019 జూన్ 30 న కాగజ్ నగర్ మండలం సార్సలలో ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనులకు జరిగిన గొడవకు సంబంధించి 39 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరంతా రిమాండ్ కు వెళ్లి రాగా ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. పోడు భూముల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరసిస్తూ జిల్లాలో మూడురోజులపాటు నిరసన దీక్షలు చేపట్టగా.. పెంచికల్​పేట, బెజ్జూరు పోలీస్​స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో బీజేపీ నేత హరీశ్​బాబుతో పాటు కొండపల్లి గ్రామానికి చెందిన 20 మందిని, రెబ్బెన గ్రామానికి చెందిన 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో పోడు భూముల సమస్యపై పోరాటం చేస్తున్న 27 మంది రైతులపై 2019 జూలై 28న అటెంప్ట్ మర్డర్  కేసులు నమోదు చేశారు. రైతులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టాలు మాత్రం రావడం లేదు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా పరిధిలో గిరిజన రైతులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడుభూములు తమవేనని చెప్తున్న ఫారెస్ట్​ఆఫీసర్లు కొత్త పాస్ బుక్ లు రాకుండా చేశారు. దీంతో రెండు నెలల కింద తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేయగా.. 11 మంది రైతులపై పోలీసులు కేసు పెట్టి, రిమాండ్ చేశారు.  నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు 9 మంది పై కేసులు నమోదు చేయించారు. వనపర్తి జిల్లాలో 60 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ప్రభుత్వం మెడికల్​కాలేజీ నిర్మాణం చేపట్టగా.. అడ్డుకున్న వనపర్తి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటయ్య యాదవ్​పై కేసుపెట్టి, 12 రోజుల పాటు రిమాండ్ చేశారు. ఈ నెల 7న అరెస్టయిన ఆయన రెండు రోజుల కింద జైలు నుంచి తిరిగివచ్చి జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలం మాచారంలో  పోడు భూముల స్వాధీనానికి వచ్చిన ఫారెస్ట్ స్టాఫ్ ను అడ్డుకుని పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించారని జులై 2న నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఫారెస్టు బీట్ పరిధిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 15 మంది రైతుల పై జులై 29 న ఫారెస్ట్ ఆఫీసర్లు కేసులు పెట్టారు. ఇదే జిల్లా గుండాల మండలం బాటన్ననగర్​కు చెందిన పాయం కాంతారావు తోపాటు మరో ఇద్దరిపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేయగా, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. భూపాలపల్లి జిల్లా పంది పంపుల గ్రామంలో ఈ నెల 16న ఫారెస్ట్ ఆఫీసర్ల పై దాడి చేశారని  నలుగురు పోడు రైతులు కొమ్ము మంజుల, మహేశ్‌, గోపనవెని ఓదెలు, మహేందర్  పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇదిగో, అదిగో అంటూ ఏడేండ్లుగా పోడు భూములకు పట్టాలిస్తామని చెబుతున్న సర్కారు, ఇవ్వకపోగా, ఇలా కేసుల పాలు చేయడంపై గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు.

పది లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య 
రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్‌‌‌‌, కుమ్రంభీం- ఆసిఫాబాద్‌‌‌‌,  మహబూబాబాద్‌‌‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ సహా 24 జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పోడు సమస్య ఉంది. గోండులు, కొలాంలు, నాయక్​పోడ్​లు, బంజారాలు, కోయలు, తోటి లాంటి గిరిజన తెగలతోపాటు కొంత మంది గిరిజనేతరులు ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకొని బతుకుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉండడంతో పోడు భూములపై ఆదివాసీలకు సాగు హక్కులు కల్పించాలని నిర్ణయించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘రికగ్నిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ రైట్స్‌‌‌‌(ఆర్‌‌‌‌వోఎఫ్​ఆర్‌‌‌‌) యాక్ట్‌‌‌‌-2006’ ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సర్వే చేసి 2005 డిసెంబర్‌‌‌‌13 వరకు సాగులో ఉన్న పోడు భూములపై గిరిజనులకే హక్కులు కల్పించాలని ఆదేశించింది. ఫలితంగా 2007లో అప్పటి వైఎస్సార్​ సర్కారు పోడు భూములపై సర్వే చేయించగా.. తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములను సాగుచేసుకుంటున్నట్లు తేలింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 1,83,107  అప్లికేషన్లు స్వీకరించారు. ఇందులో మొదటి దశ కింద  3.16 లక్షల ఎకరాలపై 93,494 మందికి ఆర్​వోఎఫ్​ఆర్​ పట్టాలిచ్చారు. కానీ 2020 మార్చి వరకు  దాదాపు 7.54 లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని టీఆర్​ఎస్​ ప్రభుత్వం అప్పట్లో కేంద్ర సర్కారుకు నివేదించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర సర్కారు ఒక్క ఎకరానికి కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని, పైగా వైఎస్సార్​ సర్కారు ఇచ్చిన 3.16 లక్షల ఎకరాల్లోంచే హరితహారం కోసం 50 వేలకుపైగా ఎకరాలను ఈ సర్కారు వెనక్కి తీసుకుందని మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగవుతున్నాయని, వాటికి హక్కులు కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.


ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్​లో గిరిజన రైతుల పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆగస్టు 3న ఫారెస్ట్​ ఆఫీసర్లు వెళ్లారు.హరితహారం కింద మొక్కలు పెట్టేందుకు పత్తి పంటను ధ్వంసం చేస్తుండగా.. గిరిజన రైతులు వద్దని వేడుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో తమపై దాడి చేశారంటూ అటవీశాఖ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 6న ముగ్గురు పిల్లలతోపాటు తల్లులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్​ చేశారు.  బాలింతలపైనా కేసు నమోదు పెట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసును  విత్ డ్రా చేసుకున్నారు. వారం తర్వాత బాధితులు విడుదలైనా కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 


రికార్డుల ప్రక్షాళన పేరుతో.. 
మా తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నం. బోర్లు వేసుకున్నం. ఏండ్ల సంది పంటలు పండించుకుంటున్నం. పన్నులు కూడా కడుతున్నం. రికార్డుల ప్రక్షాళన పేరుతో అధికారులు మా భూమిని ఫారెస్ట్ పరిధిలో చేర్చిన్రు. దాంతో పార్ట్ బీలో పెట్టి పాస్ బుక్ లు ఇయ్యలేదు. పాస్ బుక్ లు ఇయ్యాలని పోతే  మా మీదనే ఉల్టా కేసు పెట్టిన్రు. నెల రోజులు జైల్లో ఉన్న. గింత అన్యాయం ఉంటదా..ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలె?
                                                                                                                                                                                        - కేశ్య నాయక్, తాళ్ళపల్లి గడ్డ తండా,    మెదక్ జిల్లా 


రెండు నెలలు జైలులో పెట్టిన్రు..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన మాకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నం. కానీ ఫారెస్ట్​ ఆఫీసర్లు అవి పోడు భూములంటూ మొక్కలు నాటుతున్నరు. మా భూముల కోసం పోరాటం చేస్తే రెండు నెలలు జైలులో పెట్టిన్రు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్  ఉప ఎన్నికలప్పుడు మా పోడు భూముల సమస్యను తీరుస్తమని సీఎం హామీ ఇచ్చినా నేటికీ పరిష్కారం కాలేదు. 
                                                                                                                                                                                 - జగన్ నాయక్, గుర్రంబోడు తండా,    సూర్యాపేట జిల్లా
 

Tagged atrocity, forest, officials, Bhadradri Kothagudem District, , Farmer\\\\\\\'s, Madhavaram

Latest Videos

Subscribe Now

More News