- డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్ట్‌లో ప్రొఫెషనల్స్ కూడా..
- 10 నెలల్లో 1,148 కేసులు.. 2,070 మంది అరెస్ట్
- ఇందులో అత్యధికులు మిడిల్ క్లాస్ యువతే
- సోషల్ మీడియా అకౌంట్లతో ఎర
- ఎంత నిఘా పెట్టినా .. స్పెషల్ డ్రైవ్‌లు చేసినా సప్లై ఆగుతలే
- గ్రామాల నుంచి వచ్చి మరీ గాంజా కొనుగోలు
హైదరాబాద్, వెలుగు:
గంజాయి, డ్రగ్స్‌కు కాలేజీ స్టూడెంట్లు, యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. కాలేజీలు, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రాంగణాలు వీటికి అడ్డాగా మారుతున్నాయి. గంజాయి వినియోగదారుల్లో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు, కొకైన్, ఇతర సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలవంటి హై-ప్రొఫైల్ వ్యక్తులు ఉండడం చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తున్నది.
పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎన్ని ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టినా, ఎంత నిఘా పెట్టినా ఈ డ్రగ్స్, గంజాయి దందాకు అడ్డుకట్ట పడడం లేదు. సోషల్ మీడియా అకౌంట్స్‌తో యువతకు స్మగ్లర్లు నేరుగా ఎర వేస్తూ ..తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. తాజాగా.. ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు నమోదైన డ్రగ్స్, గంజాయి నేరాల సంఖ్య, అరెస్టుల వివరాలు తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ అక్టోబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,148 నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఏకంగా 2,070 మందిని అరెస్టు చేశారు.
ఇందులో 70 శాతం మంది యువతే ఉన్నారు. డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న 586 వెహికల్స్‌ను సీజ్ చేశారు. మొత్తం 1,204 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అత్యంత ప్రమాదకరమైన 103.95 గ్రాంల కొకైన్, 170.3 గ్రాంల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లు, నిఘా పెట్టినా ఆగని దందా, మాదకద్రవ్యాల నివారణకు తెలంగాణలో ‘ఈగల్’ (టీజీ న్యాబ్) లాంటి ప్రత్యేక విభాగాలను రంగంలోకి దించారు. నిఘా పెంచడంతో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నప్పటికీ, దీని వినియోగం మాత్రం తగ్గడం లేదు.
విచ్చలవిడిగా పార్టీలు..
మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్న, వాటిని సప్లై చేస్తున్న వారిలో యువతే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా నగరాల్లోని కార్పొరేట్ కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల విద్యార్థుల్లో గంజాయి వినియోగం అత్యధికంగా నమోదవుతున్నది. మెడికల్ కాలేజీల్లో సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయిని విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారిలో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాల వారే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికో లేదా సరదా కోసమో మొదలుపెట్టి, చివరకు వ్యసనానికి లోనవుతున్నారు.
ఇక కొంతమంది మెడికోలు, డాక్టర్లు, సినీ నటులు, ఐటీ ఉద్యోగులు లాంటి ఉన్నత ప్రొఫెషనల్స్కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. సినీ రంగంలో పలువురు ప్రముఖ నటీనటులు, సెలబ్రిటీలు ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిసలైన ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇక, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు తమ అధిక పని ఒత్తిడి , ఒంటరితనం లేదా విలాసవంతమైన జీవనశైలి కారణంగా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. వీకెండ్ పార్టీల్లో పాల్గొనే ఈ టెకీలు, సాధారణంగా కొకైన్, ఎల్‌ఎస్‌డీ (ఎల్‌ఎస్‌డీ), ఎండీఎంఏ (ఎండీఎంఏ), హాష్ ఆయిల్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఫామ్‌హౌస్‌లు, పబ్‌లలో జరిగిన దాడుల్లో పట్టుబడిన వారిలో అధిక శాతం మంది ఐటీ ఉద్యోగులు ఉండడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. అంతేకాకుండా వైద్య నిపుణులు, ఇతర ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గంజాయి వినియోగం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటే, కొకైన్, హెరాయిన్‌లాంటి ఖరీదైన డ్రగ్స్‌కు మాత్రం ఉన్నత వర్గాలకు చెందిన వారే బానిసలవుతున్నారు.
స్నాప్ చాట్, ఇన్‌స్టాగ్రాం వేదికగా..
డ్రగ్స్ వ్యాపారులు యువతను ఆకర్షించడానికి నేరుగా వారి సోషల్ మీడియా అకౌంట్స్‌ను, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను వేదికగా చేసుకుంటున్నారు. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ , టెలిగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్‌లలో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కేటుగాళ్లు సాధారణ ఎమోజీలు, రహస్య పదాలను (కోడ్‌లు) ఉపయోగించి డ్రగ్స్ గురించి ప్రచారం చేస్తూ, సులభంగా విక్రయాలు జరుపుతున్నారు. డ్రగ్ ట్రాఫికర్లకు సోషల్ మీడియా ‘వన్-స్టాప్ షాప్’గా మారింది.
కొత్త పద్ధతుల్లో రవాణా..
ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా 3 రెట్లు పెరిగింది. పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు సంస్కృతి ఇప్పుడు గ్రామాలకూ పాకింది. గ్రామాల్లోని యువకులు కూడా గంజాయి మత్తుకు బానిసలవుతూ.. కొనుగోలు కోసం సిటీలకు వచ్చి వెళ్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక స్మగ్లింగ్ కోసం డెలివరీ బాయ్స్‌ను వాడుకోవడం, ఆహార పొట్లాల (ఇడ్లీ, దోశ, బిర్యానీ) మాటున గంజాయిని తరలించడం, చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ రూపంలోకి మార్చి విక్రయించడంలాంటి కొత్త పద్ధతులను ముఠాలు అనుసరిస్తున్నాయి. ఎక్సైజ్ నివేదిక ప్రకారం 2025లో 68.28 కిలోల గంజాయి మిశ్రమ చాక్లెట్లను, 20.1 కిలోల గంజాయి ఐస్ క్రీమ్‌ను పట్టుకున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వివరాలు
డ్రగ్స్ రకం స్వాధీనం చేసుకున్న పరిమాణం
కొకైన్ 103.95 గ్రాంలు
హెరాయిన్ 170.3 గ్రాంలు
ఎండీఎంఏ/ఎక్స్‌టసీ 714.48 గ్రాంలు
ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ 213
గంజాయి (ఎండిన) 3,736 కేజీలు
గంజాయి మొక్కలు 1,204
గంజాయి మిశ్రమ చాక్లెట్లు 68.28 కిలోగ్రాంలు
గంజాయి మిశ్రమ ఐస్‌క్రీమ్ 20.1 కిలోగ్రాంలు
