- ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
- తక్కువ ధరకే డేటా దొరకడం వెనకున్న ఉద్దేశమిదే.. రాహుల్
- సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా కుట్ర
- బిహార్ ఎన్నికల ప్రచారంలో లోక్ సభ ప్రతిపక్ష నేత ఫైర్
ఔరంగాబాద్ (బిహార్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతను రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు బానిసలుగా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సోషల్ మీడియాలోనే ఎక్కువ సేపు గడిపేలా యువతను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ కుదేలైంది. ఇలాంటి నేషనల్ ఇష్యూస్‌పై యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మోదీ కుట్ర పన్నుతున్నారు. వాళ్లను సోషల్ మీడియాకు అడిక్ట్ చేస్తున్నారు’’ అని రాహుల్ ఆరోపించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. రీల్స్‌కు అలవాటు పడేలా చేయడం అనేది 21వ శతాబ్దపు కొత్త ‘నషా’ (మత్తు) అని అన్నారు. ‘‘యువత రీల్స్ మత్తులో ఉంటే.. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరని మోదీ భావిస్తున్నారు. చాలా తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభిస్తున్నది. దీంతో యువత రీల్స్ చూసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నది. దీనంతటికి కారణం ప్రధాని మోదీనే.
డేటా కొనుగోలు చేయగా వచ్చే లాభాలతో మోదీ తన కార్పొరేట్ ఫ్రెండ్స్ జేబులు నింపుతున్నారు. దేశంలో ఉద్యోగాల్లేవు. అందుకే యువతను రీల్స్, వీడియోలతో బిజీగా ఉంచాలని మోదీ కోరుకుంటున్నరు. కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. అగ్నివీర్ కారణంగా సైన్యంలో పర్మినెంట్ జాబ్‌లు లేకుండా పోయాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ యువత తీవ్రంగా నష్టపోతున్నది’’ అని రాహుల్ ఆరోపించారు.
యువతను లేబరర్లుగా మార్చేసిన్రు
బిహార్ యువతను సీఎం నితీశ్ కుమార్ లేబరర్లుగా మార్చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఎగ్జామ్ ఏదైనా.. పేపర్ లీకులు కామన్ అయిపోయాయి. సంపన్న స్టూడెంట్లు లబ్ధి పొందుతున్నారు. హెల్త్ సెక్టార్ ను పట్టించుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బిహారీలు ఢిల్లీకి పోతున్నారు. బిహార్‌లో ఎన్డీయే కూటమి గెలవదని వారికి అర్థమైపోయింది. అందుకే బీజేపీ నేతలు ఓటు చోరీకి పాల్పడుతున్నారు.
మహారాష్ట్ర, హర్యానాలో మాదిరి బిహార్‌లోనూ ఓట్ల చోరీతో గెలవాలని చూస్తున్నరు. మేము అధికారంలోకి వస్తే.. అత్యంత వెనుకబడిన వర్గాలు, సామాజికంగా అణగారిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాం. నలంద యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం. జపాన్, చైనా, కొరియా నుంచి స్టూడెంట్లు నలందలో చదువుకునేలా చూస్తాం’’అని రాహుల్ అన్నారు.
10% ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్మీ ఉన్నది
దేశానికి సేవ చేసే ఆర్మీ కూడా.. 10 శాతం మంది (సంపన్నులు, అగ్రవర్ణాలు) నియంత్రణలో ఉన్నదని రాహుల్ విమర్శించారు. ‘‘కార్పొరేట్ సెక్టార్లు, బ్యూరోక్రసీ, జ్యూడీషియరీతో పాటు ఆర్మీని కూడా 10 శాతం ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్లు తమ కంట్రోల్ లో పెట్టుకున్నారు. 90 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు ఏం దక్కడం లేదు. దేశంలో ఎంత వెతికినా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిథ్యం కనిపించడం లేదు.
90శాతం మంది ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. దేశంలోని వనరులు, అవకాశాలు, కంపెనీల్లో ఏ వర్గానికి ఎంత ప్రాతినిథ్యం ఉందో తెలుసుకోవడానికి కుల గణన ఎంతో అవసరం. రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. 90శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు వారి హక్కులు కల్పించడమే మా లక్ష్యం’’అని రాహుల్ స్పష్టం చేశారు.
