జగిత్యాల బల్దియాలో ఫోర్జరీ సంతకాల బాగోతం

జగిత్యాల బల్దియాలో ఫోర్జరీ సంతకాల బాగోతం
  • అక్రమార్కులతో ఆఫీసర్లు కుమ్మక్కు
  • ఇప్పటికే కమిషనర్ సహా ఆర్వో, కమిషనర్‌‌‌‌‌‌‌‌పై కేసు 
  • గతంలోనూ వెలుగులోకి కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారం

జగిత్యాల, వెలుగు: మున్సిపల్ యాక్ట్‌‌‌‌లో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని కొందరు ఆఫీసర్లు అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ దందాకు తెరలేపారు. అసలు స్థలమే లేనివారికి ఇల్లీగల్‌‌‌‌గా వీఎల్టీలు, అసెస్​మెంట్లు కేటాయిస్తూ ఆస్తి హక్కు పత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇందుకు బదులుగా స్థలాల్లో వాటా లేదంటే రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు. 

ఈ తంతులో మున్సిపల్ రెవెన్యూ రికార్డుల్లో ఇల్లీగల్​గా వీఎల్టీ నంబర్ కేటాయించి, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన ఆర్వో (రెవెన్యూ ఆఫీసర్), కమిషనర్‌‌‌‌‌‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా అసెస్​మెంట్లు కాపీలపై కమిషనర్ సిగ్నేచర్ ఫోర్జరీ చేయగా.. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా బదిలీపై వెళ్లిన ఓ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్లు వినిపిస్తోంది. జిల్లాలో తొలిసారి ఆఫీసర్ల పై క్రిమినల్ కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.   

1999 లోనే విలీనమైనట్లు రికార్డుల్లో నమోదు 

తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ లో పహాణీల మాదిరిగా మున్సిపల్ రెవెన్యూ రికార్డుల్లో అసెస్​మెంట్లు రివిజన్ బుక్కుల్లో ఆస్తి వివరాలు నమోదు చేస్తుంటారు. జగిత్యాల పట్టణానికి చెందిన కీర్తి విజయలక్ష్మీ, వుటూరీ గీతారాణి, గొల్లపల్లి సత్యనారాయణ 2011 లో జగిత్యాల పట్టణ శివారు లోని హస్నాబాద్ శివారు లో సర్వే నంబర్ 1599 లో 12 గుంటలు కొన్నారు. దీనిలో 6 గుంటలు కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ స్థలానికి సాదాబైనామాకు సంబంధించిన ఫేక్ గా 13బీ, 13సీ రికార్డులను సృష్టించారు. కాగా హస్నాబాద్ ప్రాంతం 2018 లో జగిత్యాల బల్దియాలో విలీనం కాగా.. మున్సిపల్ అసెస్​మెంట్లు మాన్యువల్‌‌‌‌ రికార్డుల్లో 1999 నుంచి ఉన్నట్లు ఆర్వో ప్రసాద్ అక్రమంగా నమోదు చేశారు. 

పైగా ప్రస్తుత కమిషనర్ తో రికార్డుల్లో సిగ్నేచర్ చేయించడంతో పాటు 2012లో పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ కమిషనర్ సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మాన్యువల్‌‌‌‌ రికార్డును 2024 ఏప్రిల్‌‌‌‌లో ఆన్ లైన్ లో నమోదు చేశారు. ఈ స్థలానికి సంబంధించిన 10 ఏళ్ల వీఎల్‌‌‌‌టీ టాక్స్ ను కూడా ఏకకాలంలో కట్టించాడు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఫోర్జరీ సిగ్నేచర్ కు సంబంధించిన ఫేక్ రికార్డును మాయం చేసినట్లు తెలుస్తోంది. కబ్జాకు యత్నించిన ముగ్గురితో పాటు కీలక పాత్ర పోషించిన ఆర్వో ప్రసాద్, కమిషనర్ అనిల్ బాబు పై కేసు నమోదు చేశారు. 

గతంలోనూ ఫోర్జరీ సిగ్నేచర్ వివాదం

జగిత్యాలకు చెందిన ఇక్రముద్దీన్ తన ఇంటి పర్మిషన్ కోసం కావాల్సిన ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ కాపీలను బల్దియాలో దరఖాస్తు చేసుకున్నాడు. సదరు ఆఫీస్ లో ఇచ్చిన అసెస్​మెంట్లు కాపీలను జత చేసి పర్మిషన్‌‌‌‌కు అప్లై చేసుకున్నాడు. అయితే, ఈ డాక్యుమెంట్లపై ఆగస్టు 9, 2021 నుంచి సెప్టెంబర్ 1, 2022 వరకు జగిత్యాల మున్సిపల్​ కమిషనర్ గా పని చేసిన స్వరూప రాణి సిగ్నేచర్ ఉండడంతో బల్దియా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వెరిఫై చేశారు. 

ఆ టైంలో మంజూరు చేసిన అసెస్మెంట్ కాపీల వివరాలు ఎంట్రీ చేసిన రిజిస్టర్ చెక్‌‌‌‌ చేయగా.. వాటి వివరాలు కనిపించలేదు. దీంతో అతడి డాక్యుమెంట్‌‌‌‌ను నకిలీదిగా తేల్చారు. ఏకంగా బల్దియా కమిషనర్​ సిగ్నేచర్​ ఫోర్జరీ చేసినట్టు తెలిసినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఒత్తిడితో  అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. 

కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీరియస్‌‌‌‌


సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ యాస్మిన్‌‌‌‌ బాషా సీరియస్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆర్వో ప్రసాద్, కమిషనర్ అనిల్‌‌‌‌బాబుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో శాఖ పరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. ఆర్వో ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని సీడీఎం(కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మిస్ట్రేషన్) కు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. గతంలోనూ పలు వివాదాల్లో ఉన్న ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందుని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కమిషనర్ అనిల్ బాబు లాంగ్ లీవు పై వెళ్లినట్లు సమాచారం. జూన్ 10 నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ సైతం వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడం తో కీలక సెక్షన్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో డీఈ యాదగిరికి ఇన్‌‌‌‌చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.