బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి

బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి
  • వాటికి పాలక మండళ్లను నియమించాలి
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు పరచాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య 

ముషీరాబాద్,వెలుగు:  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. తద్వారా బీసీ కులాలకు ఆత్మగౌరవంతో పాటు నాయకత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.  ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో తెలంగాణ ఎంబీసీ సంఘం, 36 బీసీ సంఘాల సమావేశం జరిగింది.

ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులాల జనాభా చేపట్టాలని కోరారు. రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్రలో కులగణన చేస్తామని ప్రకటించారని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటులో బీసీలకు అత్యధికంగా బడ్జెట్ కేటాయించి దేశంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి రూ. 10 లక్షల బీసీ బంధు పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. బెక్కం వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన కుల సంఘాల సమావేశం వివిధ సంఘాల నేతలు మురళీకృష్ణ, జగదీశ్, కొల శ్రీనివాస్, సీహెచ్ విజయేంద్రసాగర్, పగడాల ఎల్లన్న, వేముల రామకృష్ణ, గురు చరణ్, రాజేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.