- కాల్వలో పడేసిన దుండగులు
- సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామంలో బీఆర్ఎస్‌మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(44) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సూర్యాపేటలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు.. సాయంత్రం నుంచి ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యర్కారం గ్రామ శివారులోని ఓ కాల్వలో అనుమానాస్పద సంచి కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సంచిని ఓపెన్‌చేసి.. మధు డెడ్‌బాడీగా గుర్తించారు.
మధు హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మధు కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు.. తన భార్య మౌనిక ఫోన్‌రిపేర్‌కావడంతో దానిని ఓ షాపులో ఇచ్చాడు. మధ్యాహ్నం తర్వాత అతడి చెల్లె భర్త ఫోన్‌చేయగా.. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. రాత్రి 7 గంటలు అయినా రాకపోవడం, ఫోన్‌చేస్తే ఎత్తకపోవడంతో మధు చెల్లె, బావ అతడి ఇంటికి వచ్చి భార్య మౌనికకు విషయం చెప్పారు.
తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఎన్ని సార్లు ఫోన్‌చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి రాత్రి 2 గంటలకు సూర్యాపేట టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉదయం 5 గంటల సమయంలో సూర్యాపేట - జనగామ రహదారి వెంట యర్కారం గ్రామ సమీపంలో గోనెసంచిలో డెడ్‌బాడీ ఉన్నట్టు గుర్తించారు. మధు కుటుంబ సభ్యులను పిలిచి గోనె సంచి విప్పి చూడగా.. ఆ డెడ్‌బాడీ మధుదేనని తేలింది. ఘటనాస్థలాన్ని ఎస్పీ నరసింహతో పాటు పట్టణ సీఐ, ఫోరెన్సిక్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌పరిశీలించారు.
కాగా, యర్కారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పాతకక్షల కారణంగానే తన భర్తను హత్య చేసి ఉంటారని మౌనిక అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. మధు డెడ్‌బాడీని సూర్యాపేట హాస్పిటల్‌కు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు భారీసంఖ్యలో తరలివచ్చారు. పోస్టుమార్టం అనంతరం పోలీసు బందోబస్తు నడుమ మధు అంత్యక్రియలు ముగిశాయి. అయితే, ఈ హత్యతో గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో అదనపు బలగాలను మోహరించి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దశాబ్దాల రాజకీయ కక్షలు.. తొమ్మిది మంది బలి..
సూర్యాపేట మండలం యర్కారం గ్రామం దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ కక్షలతో ఫ్యాక్షన్ గడ్డగా మారిపోయింది. నాయకులుగా ఎదగాల్సిన యువకులు, రాజకీయ నేతలు ఇక్కడ వరుసగా శవాలుగా మారుతున్నారు. గత 40 ఏండ్లలో ఈ చిన్న గ్రామానికి చెందిన దాదాపు తొమ్మిది మంది ముఖ్య నేతలు ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మధు హత్య సైతం 2007లో జరిగిన మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా జరిగినట్టు తెలుస్తోంది.
ఆయన కుమారుడు మిద్దె జీవన్ పక్కా ప్లాన్‌తో మధును చంపాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, 2020లో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులోనూ మధు ప్రధాన సాక్షిగా ఉన్నాడు. మధు బతికుంటే తమకు శిక్ష పడుతుందనే భయంతో వెంకన్నను చంపిన ముఠాయే మధును కూడా లేపేసిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం హత్య జరిగిన సమయంలో మధుకి అత్యంత సన్నిహితుడే ప్రత్యర్థులకు సమాచారం ఇచ్చి అతని ఇంట్లో తాగిన మత్తులో ఉన్న మధుని దారుణంగా హత్య చేశారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే : జగదీశ్‌రెడ్డి
మధుది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జనరల్‌హాస్పిటల్‌లో మధు డెడ్‌బాడీకి జగదీశ్‌రెడ్డి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. గతంలోనూ తమ పార్టీ సర్పంచ్‌ఒంటెద్దు వెంకన్నను సైతం దారుణంగా హత్య చేశారన్నారు. మధు ఫ్యామిలీకి అండగా ఉంటామని, ఇద్దరు ఆడపిల్లల చదువులు, కుటుంబ పోషణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జిల్లా కేంద్రంలోనే హత్య చేసినట్టు గుర్తింపు
మధును పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు తెలుస్తోంది. సూర్యాపేటలోని తాళ్లగడ్డ ఏరియాకు చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో మద్యం సిట్టింగ్‌ఏర్పాటు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అక్కడ మధును హతమార్చిన అనంతరం యర్కారం శివారుకు తరలించినట్టు భావిస్తున్నారు. 2007లో కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు, మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు ప్రతికారంగానే ఈ ఘోరం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మిద్దె రవీందర్ కుమారుడు తన అనుచరులతో కలిసి మధును టార్గెట్ చేశాడని, పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో ఒక జిమ్ ట్రైనర్ సహాయంతో మరో ముగ్గురు పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే ఇందులో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ తెలిపారు.
