- వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో మృతి
- ఇయ్యాల కోల్కతాలో అంతిమ యాత్ర
- 11 ఏండ్లు బెంగాల్ సీఎంగా సేవలు
కోల్ కతా: సీపీఎం నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. దక్షిణ కోల్ కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. భట్టాచార్యకు భార్య మీరా, కొడుకు సుచేతన్ ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం సీపీఎం హెడ్ క్వార్టర్స్ లో ఉంచనున్నారు. శుక్రవారం అంతిమ యాత్ర జరగనుంది. భట్టాచార్య కోరిక మేరకు మెడికల్ రీసెర్చ్ కోసం ఆయన అవయవాలను దానం చేయనున్నారు.
సీఎంగా11 ఏండ్లు
సీపీఎంలో నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరోలో కీలకంగా వ్యవహారించారు. కమ్యూనిస్ట్ కురువృద్ధుడు జ్యోతిబసు తర్వాత బెంగాల్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు సీఎంగా పని చేశారు. 2011లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు. అయినప్పటికీ, సీపీఎం అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో క్రమంగా భట్టాచార్య ప్రజాజీవితం నుంచి దూరమయ్యారు.
అత్యంత సాధారణ జీవితం
బుద్ధదేవ్ భట్టాచార్య ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి. రాజకీయాల్లోకి రాకముందు స్కూల్ టీచర్ గా పని చేశారు. జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయికి చేరుకున్నారు. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంను ముందుండి నడిపించి పార్టీని విజయతీరాలకు చేర్చారు. బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ఈ నిర్ణయాలే పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఆయన అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. పార్క్ అవెన్యూలోని చిన్న ఇంట్లో నివసించేవారు. సీఎంగాను అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు.
