ఉద్యమకారుడిపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ దాడి

ఉద్యమకారుడిపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ దాడి

బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కేటీఆర్ రోడ్ షో  ఏర్పాట్ల సందర్భంగా ఆ పార్టీ నేతల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్ బీఆర్ఎస్ ఆఫీసు ఇందుకు వేదికైంది. పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వలేదని ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే ప్రశ్నించగా..‘ నన్నే  ప్రశ్నిస్తావా’ అంటూ అతనిపై మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు దాడికి పాల్పడ్డాడు.

దిలీప్ ఘనాటే కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్లాడు. ఆయనను వెంటనే పార్టీ కార్యకర్తలు హైదర్ గూడలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. దాడి జరిగినప్పుడు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పక్కనే ఉన్నా వారించలేదని, దాడి ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని దిలీప్ ఘనాటే కుమారుడు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రామచందర్ రాజుపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని వాపోయారు.