Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో ముసలం..  బోర్డు డైరెక్టర్ రాజీనామా

Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో ముసలం..  బోర్డు డైరెక్టర్ రాజీనామా

ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి జింబాబ్వే అర్హత సాధించడంలో విఫలమవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు డైరెక్టర్ హామిల్టన్ మసకద్జా తన పదవికి రాజీనామా చేశారు. జట్టు విజయాలు, వైఫల్యాలు అన్నింటిలో తన బాధ్యతలు పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మసకద్జా తన రాజీనామా లేఖలో తెలిపారు.

ఉగాండా చేతిలో ఓటమి

గతేడాది ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్‌లో భాగంగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే పరాజయం పాలైంది. మొదట జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని  ఉగాండా మరో ఐదు బంతులు(19.1 ఓవర్లలో) మిగిలివుండగానే చేధించింది. ఈ  ఓటమితో జింబాబ్వే క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024కు అర్హత సాధించలేకపోయింది. ఎంతో చరిత్ర కలిగిన జింబాబ్వే జట్టు.. పసికూన ఉగాండా చేతిలో ఓటమిపాలవ్వడం ఆ దేశ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

ఆ ఓటమి నన్ను బాధించింది

2019 అక్టోబర్‌లో మసకద్జా జింబాబ్వే క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉగాండా చేతిలో పరాజయం పాలవ్వడం తన కెరీర్‌లోనే ఒక చేదు జ్ఞాపకమని మసకద్జా తెలిపారు. అందుకు క్రికెట్ డైరెక్టర్‌గా తానే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్‌లో అర్హత సాధించని ఐసీసీ ఏకైక పూర్తి సభ్య దేశం జింబాబ్వేనే అంటూ మసకద్జా కంటపడి పెట్టుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టతరం అయినప్పటికీ తప్పడం లేదని, పదవిలో ఉన్న ప్రతిక్షణం తన మనస్సును జ్ఞాపకాలు కలిచివేస్తున్నట్లు మసకద్జా తెలిపారు.