పంజాగుట్ట, వెలుగు: దేశంలో హాఫ్ డెమోక్రసీ మాత్రమే నడుస్తోందని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ఆరోపించారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా ఆగస్టు 7న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో తొలి జాతీయ ఓబీసీ విద్యార్థుల మహాసభ, మండల్ దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, మహిళలకు ఉన్నత పదవులు, చట్టసభలు, న్యాయవ్యవస్థలో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, పదోన్నతుల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ.. ఓబీసీలు చైతన్యవంతం కావాలని, కులగణన ఆధారంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మహాసభ ద్వారా ఓబీసీల భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఓబీసీ స్టూడెంట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ తెలిపారు. అమెరికాలోని బీసీ ఎంప్లాయిస్ థింక్ ట్యాంక్ ప్రతినిధి వెంకట్ మారోజు, బీసీ టైమ్స్ వ్యవస్థాపకుడు సంగెం సూర్యారావు, ఎస్టీఎఫ్ అధ్యక్షుడు దేవరకొండ సైదులు తదితరులు పాల్గొన్నారు.
