1969 తెలంగాణ ఉద్యమంలో నారాయణ దాస్ కీలక పాత్ర

1969 తెలంగాణ ఉద్యమంలో నారాయణ దాస్ కీలక పాత్ర

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమ నాయకుడు మడత నారాయణ దాస్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు అన్నారు. శనివారం లక్డీ కపూల్ లోని వాసవి సేవా కేంద్రంలో నారాయణ దాస్ ఫౌండేషన్, 1969 ఓయూ విద్యార్థి ఉద్యమకారుల సంస్థ ఆధ్వర్యంలో మడత నారాయణ దాస్ వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి  జస్టిస్ ఎల్ నర్సింహా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములుతో కలిసి విద్యా సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు భాగం కావడంలో నారాయణ దాస్  కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. నిరాడంబర జీవితంతో నారాయణ దాస్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. నారాయణ దాస్ చాలా ధైర్యవంతుడని, అనుకున్నది సాధించేవరకు వదిలేవాడు కాదని గుర్తు చేశారు. నారాయణ దాస్ తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందన్న ఆయన... త్వరలోనే నారాయణ దాస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రస్తావిస్తూ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వామపక్ష భావజాలంతో ఉన్న తనను ఆర్ఎస్ఎస్ లోకి తీసుకురావడంలో నారాయణ దాస్ ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు.